Thathva Rahasyaprabha    Chapters   

శ్రీ మహాగణాధిపతయే నమః

సోపానపంచకం

శ్రీ శంకరాచార్యులవారిచే రచింపబడిన శ్రీ మద్వైతోపదేశ పంచరత్నములనే మరియొక పేరుగల సోపానపంచకం మద్దులవల్లి మాణిక్య శాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభయను తెలుగు టీకాతాత్పర్య వివరణసహితము.

పరమదయాళువులయిన శంకరభగవత్పాదులవారు సంసారదావాగ్నిచే దగ్ధులై అతితాపమునుపొందుచున్న జీవరాసులనుచూచి అత్మ జ్ఞానామృతముచేతనే ఈ తాపమును శమింపచేయవలయునుగాని వేరు సాధనం లేదని యాలోచించి జ్ఞానమనే సాధనమునే ఉపదేశించిరి. ఈ జ్ఞానమువలన అజ్ఞానముతోసహా సంసార జననమరణ తాపశాంతియు పరమానందప్రాప్తియు కలుగును. అజ్ఞానమువలన సంభవించిన తాపము జ్ఞానమువలననే పోవునుగాని కర్మవలన పోదు. జ్ఞానఫలమైన మోక్షం నిత్యము, కర్మఫలము అనిత్యము.

తేతంభుక్తా స్వర్గలోకం విశాలాం క్షిణపుణ్యమర్త్యలోకం విశంతి అని పుణ్యఫలమును స్వర్గలోకంలో అనుభవించి మరల ఈ లోకమునకు వచ్చెదరని భగవద్వచనం చెప్పుచున్నది. ఈలోకంలో వ్యవసాయ వ్యాపారాదులవలన కలుగు ఫలం నశించిపోవుచున్నది. మరల చేయవలసివస్తున్నది. ఇటులనే పుణ్యకర్మలకు ఫలములైన స్వర్గాదిసుఖములు కూడా కొంతకాలమునకు నశించునవేగాని నిత్యములుకావు (కొన్నిచోట్ల)చాతుర్మాప్యయాగంచేస్తే నిత్యమయిన సుకం వచ్చునని చెప్పినను ఆ పుణ్యఫలం చాలాకాలం వుండుననే యర్థంకాని పూర్తినిత్యంకాదని తాత్పర్యం. అశ్వత్ధామా బలిర్వ్యాసహః హనుమాంశ్చ విభీషః కృపః పరశురామశ్చసపై#్తత స్థిరజీవినః అని వచనమున్నది.

అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసులవారు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యులవారు, పరశురాములవారు, స్థిరజీవులంటే బ్రహ్మకల్పం పూర్తిగా జీవింతురనేగాని అసలే ఆ వుపాదులకు నాశంలేదని అర్ధంకాదు. కర్మఫలంకూడా నిత్యమన్నను ఎక్కువకాలం ఉంటే వుంటుంది గాని అసలు నాశం లేదనికాదు. శృతికూడా మోక్షమునకు జ్ఞానముకంటె రెండవ మార్గంలేదని చెప్పుచున్నది. గనుక కర్మ నిత్యసుఖ సాధనంకాదు. అర్థము, కామము, నిత్యసుఖమునకు అసలు సాధనములు కావని ప్రత్యక్షంగా తెలుస్తున్నదికదా! అందువలన నిత్యసుఖరూపముగా మోక్షమునకు జ్ఞానమే సాధనం గనుక అట్టి జ్ఞానం ఏ సాధనములవలన కలుగునని ఆలోచించి గీతా భాష్యము, ఉపనిషద్భాష్యము, సూత్రభాష్యము అను అతి గంభీరమైన సముద్రమునుండి అయిదు రత్నములను సంపాదించిరి. అనగా భాష్యత్రయసారమును ఈ అయిదు పపంచరత్నములతో చెప్పిరని యర్థము. సామాన్య జనులకుకూడా సులభముగా తెలియుటకు సులభ##శైలితో పూర్వజన్మ సంస్కారమువలన నేనేమిచేసిన కృతకృత్యుడ నగుదునని తెలుసుకొన తలచి (ఒక) శిష్యుడగు బాలుని ఉద్దేశించి అనుగ్రహముచేత గురువుగారు ఒక మెట్టు ఎక్కిన తరువాత మరియొక మెట్టు ఎక్కుమని చెప్పినట్లు సోపానక్రమముగా ఉపదేశించిన పద్ధతిని కల్పించి శంకర భాగవత్పాదులవారు చెప్పుచున్నారు.

అందువలననే ఈ శ్లోకములను సోపాన పంచకమనికూడా అంటారు. ఆ క్రమమునే ఉపదేశిస్తున్నారు.

శ్లో|| వేదోనిత్య మధీయతాం| తదుదితం కర్మ

స్వనుష్ఠీయతాం| తేనేశస్య విధీయతా మపచితిః.

కామ్యేమతి స్త్యజ్యతాః| పాపౌఘః పరిధూయతాంః|

భవసుఖే దోషో7ను సంధీయతా మాత్మేచ్ఛావ్యవ

సీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం||1||

ప్రతిపదార్థ నిరూపణము,

వేదః = అంగములతోకూడిన వేదము, నిత్యం = యల్లప్పుడు విహితకాలమందు, అధీయతాం=త్వయం అని కలుపుకొని నీచేత (గురుముఖతాః చదువబడుగాక అని యర్థము చెప్పవలయును. కర్మణిప్రయోగం గనుక, చదువ బడుగాక యని సంప్రదాయమునుబట్టి అర్థము చెప్పినను, చదువవలయుననియే అర్థం. ఈశ్లోకములో అంతట ఇట్లే చెప్పుకొనవలయును. తదురితం=తత్‌ ఆ అధ్యయనంచేయబడిన వేదంచేత ఉదితంచేయ వలయునని విధింపబడిన, కర్మ=కర్మ, స్వనుష్ఠీయతాం=నీచేత బాగుగా (అనుష్ఠానం) చేయబడుగాక, తేన=అనుష్ఠింబడిన ఆకర్మచేత, ఈశస్య=పరమేశ్వరునియొక్క, అపచితిః=పూజ, విధీయతాం=యథావిధిగా చేయబడుకాగ, ఇక్కడ పూజయనగా కర్మఫలమును ఈశ్వరార్పణం చేయుటయని (యర్థము).

కమ్యాకర్మకూడా వేదవిహితమే గనుక కామ్యంగాకూడా కర్మచేయవచ్చునకదా యనే ప్రశ్నకు సమాధానం. కామ్యే=కామ్య కర్మయంగు, మతిః=చేయవలయుననే బుద్ధి, త్యజ్యతాం=విడచిపెట్టబడుగాక (ఫలమును ఈశ్వరార్పణం చేసిన నిష్కామ కర్మానుష్ఠానముచేత) సాపౌఘః=(పాప=పాపములయొక్క, ఓఘః=రాశి) పాపరాశి, పరిధూయతాం=బాగా దులపబడుగాక, విడిచిపెట్టబడుగాక యని యర్థము, భవసుఖే=సంసారసుఖమందు, దోషః=అనిత్యమని, దుఃఖసంబంధము కలదనే దోషము, అనుసంధీయతాం = స్మరింపబడుగాక, (కర్మఫలమును విడిచి సంసారసుఖం మంచిది కాదనుకంటే మనకు పురుషార్ధమేమి అంటా వేమో నాయనా) ఆత్మేచ్ఛా = ఆత్మవిషయక, ఇచ్ఛా వ్యవసీయతాం=నిశ్చయింపబడుగాక, అనగా ఆత్మ సచ్చిదానంద స్వరూపముగనుక అట్టి ఆత్మను తెలుసుకుందామనే కోరికను సంపాదించుకొనమని యర్థము. ఆత్మయందు కోరికకలిగినంత మాత్రంతో చాలదు. విచారంకూడా చేయవలయును, అట్టి విచారం గృహమందు బాగా జరుగదని చెప్పుచున్నారు కదా! అంటే నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం, నిజగృహాత్‌ = నిజ తనసంబంధమయిన, గృహతీ=ఇంటినుండి, తూర్ణం=శీఘ్రముగా అనగా తొందరగా వినిర్గమ్యతాం=(అభిమానందవదలి) వెళ్ళబడుగాక.

తాత్పర్య వివరణం.

తీవ్ర వైరాగ్యం కలవారుగాని సర్వసంగపరిత్యాగం చేయలేరు. అట్టివారికే జ్ఞానం కలుగును. ఇట్టి తీవ్రవైరాగ్యం పూర్వజన్మలయందు చేసిన నిష్కామకర్మానుష్ఠానమువలన ఈ జన్మలో విశేషంగా చేయని వారికిగూడా కొంతరికి బాల్యమందే కలుగును. వారు బ్రహ్మజిజ్ఞాన కలిగి బ్రహ్మవిచారం అనగా శ్రవణం మననంచేసి ఆత్మానుభూతిని పొంది కృతకృత్యులగుదురు వారిమాట అట్లా వుంచండి, అట్టి తీవ్రవైరాగ్యం లేని వారు క్రమముగా ఆస్థితిని పొందవలెనని గురువు శిష్యునితో చెప్పినట్లు చెప్పుచున్నారు. ఇది ద్విజుల విషయంలో చెప్పిరి. నాయనా నీవు విరక్తుడవై జ్ఞానం కలిగి తరించాలంటే ఇట్లు చేయుము. నిత్యము వేదమును చదువుము, ఉపనయనమైన తరువాత సద్గురువులవద్ద శక్తివుంటే అన్ని వేదములను, లేనియడల తన శాఖకు చెందిన వేదమునుగాని చదువవలయును, అర్థజ్ఞానంకొరకు శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం కల్పము అను ఆరు వేదాంగములనుకూడా చదువవలయునని యర్థము. శాస్త్ర జ్ఞానంలేనిది వేదముల అర్థం బాగుగా తెలియదు గనుక శాస్త్రజ్ఞానం చాలా అవసరం, శాస్త్రజ్ఞానం బాగుగా వున్నపుడే వేదములోని కర్మకాండగాని జ్ఞానకాండగాని బాగుగా అర్థమగును. బాగా చదివి అర్థం చేసుకొని, వారివారి అధికారముల ననుసరించి వేదశాస్త్రములు ఎవరెవరికి యేయే కాలముయందు యేయే కర్మలు చేయతగినవని చెప్పుతున్నవో ఆ యా కర్మలను వారు చేయవలయును. అధికారం లేని కర్మలనుచేసి నరకమును పొందకూడదు.

నిత్యకర్మలు నై మిత్తిక కర్మలు, కామ్యకర్మలు అని కర్మలు అనేక విధములుగానున్నవి. నిత్యము లనగా స్నానం సంధ్యావందనం మొదలగు కర్మలు, ఈ కర్మలను చేయకపోతే పాపం వస్తుంది. అందు వలన పాపం రాకుండా తప్పక చేయవలెను. చేసిన పాపక్షయంకూడా అగును. నైమిత్తకములనగా ఒక నిమిత్తం వచ్చినపుడు చేసితీరవలసినని, గ్రహణం పట్టింది. ఆ నిమిత్తంవలన పట్టు స్నానం విడుపు స్నానం చేయవలయును ఇలాంటివి. కామ్యకర్మలు పుత్రులు, పశువులు, ధనం మొదలగు ఫలములు కావలెననే కోరిక కలవారికి ఆ ఫలములు సిద్ధించుటకుగాను చెప్పబడిన కర్మలు.

శ్రౌతకర్మలు. స్మార్తకర్మలనికూడా భేదమున్నది. అగ్నిహోత్రం మొదలగునవి శ్రౌతకర్మలు. ఔపోశనం వైశ్వదేవం మొదలగునవి స్మార్తకర్మలు ఈ విషయంలో ఇంకా వ్రాసిన చాలా విస్తారమగును గనుక కొద్దిగా తేడాలను వ్రాసితిని. కర్మఫలం అనిత్యమగు స్వర్గాదులు, జ్ఞానఫలం మొక్షము, అది నిత్యము ఇట్టి కర్మలను మెక్షానికి ఉపయోగించవలెనంటే ఈశ్వరార్పణ బుధ్యా, కోరికలేకుండా చేయవలెను. అట్లు చేసినయడల పాపముపోయి, అంతఃకరణశుద్ధి కలుగును, అంతఃకరణ శుద్ధి కలిగిన తరువాత జ్ఞానము కలుగును, వైరాగ్యము కలుగునంతవరకు నిష్కామ కర్మానుష్ఠానమనే కర్మయోగమే అవసరము.

కామ్యకర్మలనుకూడా వేదము చెప్పుచున్నది. కాని ఫలం కావలెననే కోరికతో కర్మలను చేసినయడల జన్మ పరంపరకలుగను గనుక ఫలాకాంక్షతో చేసినయడల వైరాగ్యం కలుగదు. కనుకను కామ్మ కర్మలను వదలివేయమని చెప్పిరి. కమ్యకర్మలనుకూడా కోరకలేకుండా చేసిన యడల బంధకములు కావుగాని కామ్యములయందు ప్రవర్తించిన ఫలముల యందు కోరిక కలుగవచ్చును. కోరిక జ్ఞానమార్గమునకు ప్రతిబంధకమగునని కామ్యేమతి స్త్యజ్యతామని చెప్పిరి.

పాపౌఘః పరిధూయతా యనుటవల్ల అనేక పాపములన్నియు నిష్కామ కర్మానుష్ఠానమువలన నశించునని తేలుచున్నది. తరువాత సంసారిక సుఖములు నశించునవేగాని నిత్యములుకావు. సాంసారిక సుఖం రాకముందునూ దుఖఃమే పోయేటపుడుకూడా దుఃఖమే గనుక దుఃఖముతో కలిసియేయుండును గనుక సంసారసుఖములు అనిత్యములు, దుఃఖ భాహుళములు. గనుక మనశ్శుద్దికి ప్రతిబంధకమని జన్మమరణప్రవాహమునకు దారి తీయునవని దోషముల నెంచవలయును. అటుల దోష దృష్టికలిగిన విషయములయందు విరక్తికలుగును. ఆ విరక్తివలన ఆత్మేచ్ఛ అనగా బ్రహ్మ జిజ్ఞాన కలుగును తీవ్రమైన బ్రహ్మజిజ్ఞాన కలిగేటట్లు కృషిచేయమని తాత్పర్యము.

ఆత్మేచ్ఛ అన్నను బ్రహ్మ జిజ్ఞాసయన్నను ఒకటేగాని వేరుకాదు. ఆత్మజిజ్ఞాన యనగా ఆత్మను తెలుసుకుందామనే కోరికయని అర్థము. బ్రహ్మజిజ్ఞాస యనగా బ్రహ్మను తెలుసుకుందామనే కోరికయనే అర్థము; ఆత్మ అన్నను బ్రహ్మయన్నను భేదం లేదుగనుక ఏ విధంగానన్న అనవచ్చును ఆత్మ జిజ్ఞాస కలిగినంతమాత్రంలో జ్ఞానం కలుగదు అట్టి అత్మజ్ఞానం కొరకు వేదాంత శ్రవణము విహితకర్మలనే ఈశ్వరార్పణం చేయవలయునుగాని, నిషిద్ధకర్మలనుచేసి ఈశ్వరార్పణ చేయకూడదు. అట్లు చేసిన నరకం వచ్చును. అందువలననే తేనే శన్యవిధయతాం అని చెప్పిరి. మననము నిధి ధ్యాసనం చేయవలయును గనుక అట్టి శ్రవణాది వేదాంత విచారము ఇంటిలో గృహస్థాశ్రమంలో చేయుటకంటే గృహారామక్షేత్రాదులయందు అభిమానమును వదలి, సన్యాసాశ్రమమును స్వీకరించి తీవ్రవైరాగ్యము కలవారై శ్రవణమననాదులను చేసినయడల ప్రతిబంధము లేకుండా త్వరలోనే జ్ఞానం కలుగును. అట్టి మహాపురుషులు ముక్తులగుదురు. గృహస్థులుకూడా వారికి చెప్పబడిన కర్మలను యథా శక్తిగా చేసుకొనుచు కాళీ సమయములయందు కొంత అవకాశమును కల్పించుకొనికూడా అతి శ్రద్ధతో పెద్దలవలన వేదాంత శ్రవణమనన విచారణచేసి ఆత్మజ్ఞానమును సంపాదించి ముక్తులు కావచ్చును. సందేహం లేదు. శాస్త్రీయ విషయములలో శాస్త్రమే ప్రమాణం గాని మన ఊహయే ప్రమాణమని దిగకూడదు. గ్రంథం విస్తారమగునని సంగ్రహ ముగా వ్రాసితిని.

అవతరణిక.

దుర్జన సాంగత్యముచేసినయడల విషయలోలత కలిగి ఆత్మజిజ్ఞాన లేక తత్త్వ విచారము కలుగదుగనుక దుర్జన సాంగత్యం పనికిరాదని సూచించుచు సజ్జన సాంగత్యమే చేయవలయునని చెప్పుచున్నారు.

శ్లో|| సంగస్సత్సునిధీయతాం| భగవోతో భక్తి ర్దృఢాధీయతాం|

శాంత్యాధాఃప చీయతాం| ధృఢతరంకర్మాశు సంత్యజ్యతాం|

సద్విద్వాసుపర్ప్యతా మవదినం తత్పాదుకాసేవ్యతాం|

బ్రహ్మేశాక్షంమర్థ్యతాం శృతిశిరోక్యం సమాకర్ణ్యతాం||

ప్రతిపదార్థ వివరణము :

సత్సు=సత్పురుషులయందు, సంగః=సంబంధము, అనగా సహవానము, విధీయతాం=దేయబడుగాక, అనేక విఘ్నములవలన తత్వవిచారమే జరుగకపోవ్చుచను. జరిగినను దైవబలం లేకపోతే ఫలం సిద్ధించక పోవచ్చునుకదా! అంటే సమాధానం, భగవతోభక్తి ర్దృఢాధీయతాం | భగవతః=ఈశ్వరునియొక్క, భక్తిః=భగవంతునియందే పరమప్రేమతో మనస్సును లగ్నపరచుట, దృఢ=నిశ్చలమగునట్లు, అధీయతాం=చేయబడు గాక యని అర్థము, మనస్సునకు గల కాలుష్యము ఆత్మవిచారమునకు ప్రతిబంధకముగనుక మనస్సు కాలుష్యంపోవుటకు ఉపాయమును చెప్పుచున్నారు. శాంత్యాదిః పరిచీయతాం | శాంత్యాదిః=శాంతి మొదలగు సాధానం, పరచీయతాం=అభ్యసింపబడుగాక యని అర్థము అనగా మనో నిగ్రహం, ఇంద్రియనిగ్రహం అలవరుచుకొనమని తాత్పర్యం, శాస్త్ర విహితకర్మచేసి తీరవలెనుకదా.చేయకపోతే పాపంకదా. ఆ కర్మలయందే ఆసక్తుడై యుంటే ఆత్మవిచాం మెట్లు కలుగునంటే సమాధానం | దృఢతరం కర్మాశుసంత్యజ్యతాం! కర్మ=నిత్యనైమిత్తికాదికర్మ. దృఢతరం=శాస్త్రం చెప్పుటచేత చేయవలసినదిగా చెప్పుటచేత దృఢమైనదైనను, సంత్యజ్యతాం=విడిచిపెట్టబడుగాక, వైరాగ్యము కలిగిన తరువాత ఆలోచించకుండా కర్మసంన్యాసం చేయమని తాత్పర్యము. అలౌకికమైన బ్రహ్మ విచారమందు నాకెట్లా ప్రవృత్తి కలుగును ఎట్లా తెలుసును అంటే సమాధానం. సద్విద్వానుపసర్ప్యతాం! యోగ్యమైన పండితుడు ఉపసర్ప్యతాం (దగ్గరకు వెళ్ళబడుగాక) పొందబడుగాక యని అర్థము. విద్వాంసుని వద్దకు వెళ్ళినంతమాత్రంతో వారు నాకెందుకు ఉపదేశింతురు. నిస్పృహులు గనుక వారికి నాయందు కరుణ ఎట్లు కలుగునంటే సమాధానం.

అనుదినం తత్పాదుకాసేవ్యతాం| అనుదినం ప్రతిరోజు తత్పాదుకాతత్‌ ఆగురువుగారియొక్క పాదుకా పాదారవిందద్వయం సేవ్యతాంసేవింపబడుగాక గురువుల పాదసేవవలన అనుగ్రహము కలవారైతత్వమును ఉపదేశించుదురని భావము. అయితే అడిగితేకదా చెప్పెదరు. గురువుగారిని ఏమి అడుగవలయును అంటే సమాధానం, బ్రహ్మైకాక్షర మర్థ్యాతాం. ఏక (ఒకటి అయిన) సజాతీయ విజాతీయ స్వగతభేదరహితమైన, అక్షరం=నాశము లేని బ్రహ్మ అనగా పరమాత్మ. అర్థ్యతాం ప్రార్థింపబడుగాక, బ్రహ్మైకాక్షరం అంటే మరియొక అర్థము. బ్రహ్మ, బ్రహ్మయొక్క ఏక ఒకటైన అక్షరం ఓంకారము అని అర్థము. బ్రహ్మను ఉపదేశింపమని లేక ఓంకారము నుపదేశింపమని కోరవలయునని భావము. బ్రహ్మను గురువుగారు ఎట్లు చెప్పెదరు అంటే సమాధానం శృతిశిరో వాక్యం సమాకర్ణ్యతాం, శృతి=వేదముయొక్క, శిర=శిరస్సు అయిన ఉపనిషత్తుయొక్క వాక్యం తత్వమసియను మహావాక్యము సమాకర్ణ్యతాం బాగుగా వినబడుగాక, ఉపనిషద్వాక్యములను అర్థముతో వినమని యర్థము.

తాత్పర్య వివరణము :

పరమార్థ మార్గము లభించవలయునంటే సజ్జన సాంగత్యమే ముఖ్యము. ఇక్కడ సత్పరుషులనగా బ్రహ్మవిచారము చేయువారని తాత్పర్యము. అట్టివారితో సాంగత్యము చేసినవారికికూడా బ్రహ్మవిచారం లభించును. యోగవాసిష్ఠంలో శ్లో. మోక్షద్వారే ద్వారపాలాశ్చత్వారః పరికీర్తితాః శమో విచారస్సంతోషః చతుర్థస్సాదుసంగమః అని వసిష్ఠమహర్షి శ్రీరామచంద్రమూర్తితో నాయనా! మోక్షద్వారమందు శమమని, విచారమని, సంతోషమని, సజ్జనసాంగత్యమని నలుగురు ద్వారపాలకులున్నారు. ఈ నలుగురిలో ఒకరినైనను అతిప్రయత్నంతో స్వాధీనం చేసుకుంటే గాని ఈ ద్వారంలోనుండి వెళ్లి మోక్షమనే ప్రభువును పొందలేము గనుక ఒక ద్వారపాలకుడైనా స్వాధీనుడు కావలయునని సాథుసంగమము అవసరమని చెప్పిరి. భజగోవింద శ్లోకములలోకూడా శంకరాచార్యులవారే సత్సంగత్వే నిస్సంగత్వమని సజ్జన సాంగత్యం ప్రధానమని చెప్పిరి.

ఈ శ్లోకములయందు సోపానములవలె జ్ఞానసాధనములనే చెప్పుచున్నారు గనుక, భగవంతునియందు భక్తికూడా జ్ఞానమునకు గొప్పసాధనమే, భగవంతుడు అను శబ్దమునకు భగము కలవాడని అర్థము. భగము అనగా సమగ్రమైన ఐశ్వర్యము, సమగ్రమైన ధర్మము (కాని లేక శక్తి) గొప్ప యశస్సు, దేనికంటే బ్రహ్మాండంలో గొప్పవిలువో, అట్టివన్నమాట. గొప్ప సంపత్తు, గొప్ప వైరాగ్యము, గొప్ప జ్ఞానము. ఈ ఆరింటికి భగమని పేరు. ఈ ఆరుకలవాడే భగవంతుడు. ఈ యారుకల వాడు గనుకనే షడ్గుణౖశ్వర్వ సంపన్ను డంటారు. జీవుల వుత్పత్తి, ఎప్పుడు పుట్టేది. ఎప్పుడు (పొయ్యేది) మరణించేది, ఏ జన్మనుండి ఏ జన్మకు వచ్చేది, ఈ జన్మనుండి ఏ జన్మకు, ఏ లోకమునకు పోవునది, జ్ఞానమనగా నేమి? అజ్ఞానమనగా నేమి? ఈ అన్నిటిని బాగుగా తెలుసుకునే సర్వజ్ఞడే భగవంతుడని చెప్పబడును. ఇట్టి భగవంతుని భక్తిఅనగా సగుణ భక్తికూడా నిర్గుణ సాక్షాత్కారమునకు సాధనమేనని తాత్పర్యం.

శ్లో|| ఈశ్వరానుగ్రహా దేవపుంసా మద్వైతవాసనా

పాపోవహత బుద్ధీనాం తద్వార్తాపి నరోరచతే||

అనే వచనంవల్ల ఈ జన్మయందుగాన, పూర్వజన్మలయందుగాని భగవంతుని సేవించి భగవంతుని యనుగ్రహం పొందినవారికే, అద్వైతతత్వమును తెలుసుకొనవలయుననే శ్రద్ధ కలుగునుగాని పాపహృదయం కలవారికి ఆ మాట విందామనికూడా ఇష్టం కలుగదని తెలియుచున్నది. అందువలననే సగుణోపాసన, చేత, నిర్గుణ సాక్షాత్కారము కలిగి మోక్షము వచ్చునని క్రమముక్తిమార్గమును శాస్త్రంచెప్పుచున్నది, ఇంద్రియములను విషయములమీదకి విచ్చలవిడిగా పోకుండా నిగ్రహించుట మనస్సును దుష్టసంకల్పములలోనికి పోకుండా నిలుపుకూడా గొప్ప సాధనములే.

అందుచేతనే తైత్తిరీయో నిషత్తులో తపస్సతో బ్రహ్మను తెలుసుకొను సంకల్పం చేయమని చెప్పుచున్నది. అక్కడ తపస్సు అనగా మనోనిగ్రహం. ఇంద్రియని హమే. శాస్త్రము చెప్పినప్రకారం తీవవైరాగ్యము కలిగిన తరువాత స్వ కర్మలను విడచిపెట్టి పరమాహంసాశ్రమమును స్వీకరించివలయును తరువాత బ్రహ్మవిష్ఠుడైని సద్గురువులను ఆశ్రయించి అట్టి మహానుభావుల పాద సేవచేసి, ఈశ్వరానుగ్రహమును సంపాదించినట్లు గురువు అనుగ్రహమున కూడా సంపాదించవలయును. గురువు అనుగ్రహం కలిగినతరువాత స్వామీ నేను తరించుటకు ఉపాయమును ఆలోచించి పరమార్థతత్వమును ఉందేశించనికోవమును.

వారివలన ఉపనిషత్వర్యములను వినవలయును. అనగా కేవల జ్ఞానకాండనే వినవలయును. పరమహంస లయినవారు తత్వమునే వినవలయును తత్వమునే విచారించవలయును ప్రవృత్తికి కారణమైన శాస్త్రములను, విషయములను విచారించకూడదు. ''జ్ఞానయోగేన సాంఖ్యానాం! కర్మయోగేన యోగీనాం'' అని భగవద్గీతకూడా. విరక్తి కలిగిన ఉత్తమాధికారులకు జ్ఞానయోగమే సాధనమని విరక్తిలేనివారికి కర్మ యోగమే అవశ్యకమని చెప్పుచున్నది, ఉపనిషద్వాక్యములు రెండు రకములు, అవాంతర వాక్యములని మహావాక్యములని. అవాంతర వాక్యములనగా; సత్యస్వరూపమని, జ్ఞానస్వరూపమని, ఆనందస్వరూపమని, బ్రహ్మస్వరూపమును చెప్పు వాక్యములు, జీవునికి ఈశ్వరునికి ఐక్యమును బోధించునని మహావాక్యములు. చాలా జాగ్రతగా ఉపనిషద్వాక్యములను వింటూ సర్వబంధములను, జన్మమరణములను నిర్మూలముచేయు జ్ఞాన మార్గమును అనుసరించి కృతకృత్యులు కావలయునని తాత్పర్యము.

అవతరణిక.

వేదాంతములలో మహావాక్యములు జీవునికి పరమేశ్వరునితో ఐక్యమును బోధించుచున్నదికదా అది ఎట్లు కుదురును. జీవుడు కించిజ్ఞుడు కొద్దిజ్ఞానం కలవాడు. కర్తృత్వము, భోక్తృత్వము కలవాడు. తన స్థితిని కూడా తెలుసుకొనలేనివాడు. ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, మూడు కాలములయందు అన్నింటిని తెలుసుకున్నేవాడు, సర్వ ప్రపంచమునకు కారణ భూతుడు. ఇంటువంటి విరుద్ధమైన ధర్మములతో కూడిన జీవేశ్వరులకు ఐక్యం కుదరదు గనుక, మహావాక్యోవపదేశం వల్ల ఉపయోగమేమి? ఆ ధర్మములను తీసివేస్తే చైతన్యములకు అభేగమేగనుక, ఐక్యము బోధింపవచ్చునుకదా అందామంటే అక్కడకడ జీవ్వేగులకు భేదమున్నట్లును ఈశ్వరుడు ఉపాన్యుడని, జీవులలో ఉపాపకుడని భేదముతో సేవించుచున్నట్లు ప్రమాణములున్ననికదా. ఒక వ్యక్తి మరియొకవ్యక్తి స్వరూపపుడు కావడమెట్లు అని ప్రశ్నలు కలుగవచ్చును. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుచున్నారు.

శ్లో|| వాక్యార్థశ్చ విచార్యతాం|శృతిశిరఃపక్షస్ససూశ్రియతాం

దుస్తర్కాత్సునిరమ్యతాం|శృతిమత స్తర్కో7నుసంధీయతాం.

బ్రహ్మాస్మీతి విభావ్యతా మహరహర్గర్వః పరిత్యజ్యతాం

దేహే7హం యతిరుర్ఘ&ుతాం | బుధజనైః వాదస్స ముత్సృజ్యతాం

ప్రతిపదార్థ నిరూపణం

వాక్యార్థశ్చ విచార్యతాం||.వాక్య=తత్వమస్వాది మహావాక్యముయొక్క అర్థః జీవబ్రహ్మలకు అభేదమనే అర్థము. విచార్యతాం=విచారింపబడుగాక. అనగా త్వం పదమునకు తత్పదమునకు వాచ్యార్థము లేవి? వాచ్యార్థములగు జీవేశ్వరులకుకల భేదము నిజమయిన భేదమా? ఉపాధులద్వారా వ్చచిన భేదమా యని విచారించి, ఒకే ఆకాశం రెండుపాత్రలు చేస్తే రెండు ఆకాశములయినది. రెండుపాత్రలుపోతే ఆకాశం ఒకటే, అట్లే ఆరోపితమైన మాయా అంతఃకరణలనే ఉపాధులద్వారా జీవుడని ఈశ్వరుడని భేదము ఏర్పడినది. జ్ఞానంచేత ఆ ఉపాధులను తీసివేస్తే జీవేశ్వరులు ఆఖండ సచ్చిదానంద స్వరూపులగుదురని విచారించి తెలునుకొనమని యర్థము.

అనేకమంది మహానుభావులకు మతకర్తలు, జీవేశ్వర స్వరూపమును మోక్షస్వరూపమును భిన్నభిన్నముగా చెప్పుచున్నారుకదా, మీ పక్షమునే ఎట్లు ఆశ్రయించవలెనంటే సమాధానం, శృతిశిరః వక్షస్సమాశ్రీయతాం, శృతి=వేదములయొక్క, శిరః=శిరస్సువలె నున్న ఉపనిషత్తుల యొక్క, పక్షః=పక్షము, సమాశ్రీయతాం=ఆశ్రయింపడుగాక, మహాపురుషులు చెప్పినవి స్మృతులుగనుక స్మృతులకంటే శృతులు ప్రబలములు గనుక శృతులకు సమ్మతమైన అద్వైతసిద్ధాన్తమునే గ్రహించమని యర్థము.

మహాపురుషులు చెప్పిన మతములు, యుక్తికి సరిపోతే ఆ మతములనే గ్రహించవచ్చునుకదా అంటే సమాధానం, దుస్తర్కాత్సు విరమ్యతాం దుస్తర్కాత్‌=దుష్టమైన శృతులకు విరుద్దమైన తర్కమునుండి సువిరమ్యతాం=బాగా విరమింపబడుగాక. అనగా వేదమునకు విరుద్ధమైన శాస్త్రములో చెప్పబడిన దోషములు కల యుక్తులను ఆధారంగా చేసుకొని ఆయా మతములయందు ప్రవర్తించవద్దు. ఆ తర్కములను గ్రహించవద్దని యర్థము. మహర్షులు చెప్పినను, విరుద్ధమగు యుక్తులతో చెప్పిన పదలమనే యర్థము. అయితే తర్కమంటె యుక్తికదా. యుక్తియనగా హేతదువులతో విషయములు నిర్ణయించడంకదా. శృతియే ప్రమాణమైతే, మంచి తర్కముకూడా పనికిరాదా అంటే సమాధానం.

శృతిమతస్తర్కోను సంధీయతాం శృతిమంః శృతి=వేదమునకు మతః=సమ్మతమైన, తర్కః=అనుమానం (అనగా హేతువాదము) అను సంధీయతాం=స్మరింపబడుగాక. శృతులు చెప్పిన అర్థమును బలపరిచే అనుమానమునే గ్రహించమని అర్థము. శ్రవణము మననము చేయమని చెప్పినట్లయినది. ఆత్మనిశ్చయం కలిగినను దేహేంద్రియములందు నేను అను భ్రమవల్ల ఆత్మనిశ్చయమును మరచిపోతే యేమి చేయవలయునంటే సమాధానం, బ్రహ్మాస్మీతివిభావ్యతాం బ్రహ్మాస్మీతి = సర్వోపాధులు లేని సచ్చిదానంద బ్రహ్మనే నేను అగుచున్నానని, విభావ్యతాం=విశేషముగా భావన చేయబడుగాక, అనగా ఎప్పుడు నేను దేహేంద్రియాది స్మరూపుడను కాను బ్రహ్మస్వరూపుడనే నని నిదిధ్యాసనం చేయచుండవలయునని యర్థము.

శ్రవణ మననాదులు చేసి జ్ఞానమును సంపాదించిన తరువాతనే నేనే జ్ఞానినని అహంకారం కలుగునేమోనని, అట్టి అహంకారమును వదలి పెట్టమని చెప్పుచున్నారు. ''అహరహర్ధర్వః పరిత్యజ్యతాం'' అహరహః=ప్రతిరోజు, గర్వః=నేను జ్ఞానిని, కృతార్థుడను అనే అహంకారము, పరిత్యజ్యతాం=విడిచిపెట్టబడుగాక, అహంకారం పుట్టుటకు యెప్పుడు అవకాశముండునుగనుక యల్లప్పుడును అభిమానం విడిచిపెట్టే ప్రయత్నంలో వుండమని యర్థము. దేహమందు నేను అనే భ్రమరూపమగు అభిమానంవుంటే, నేను బ్రహ్మను అనే నిశ్చయం ఎట్లు దృఢమగును అంటే సమాధానం ''దేహే7హం మతిరుర్ఘ&ుతాం'' దేహే=స్థూల దేహమందు, సూక్ష్మదేహమందును, అహం మతిః=నేను అనే బుద్ధి, ఉర్ఘ&ుతాం=విడిచిపెట్టబడుగాక, దేహమందు నేననే అభిమానమును వదలివేయుచు ఆత్మధ్యానం చేసినయడంల, ఆత్మజ్ఞానం దృఢమగునని యర్థము,

నాకు పరమ సిద్ధాన్తం తెలిసినది. ఇతరలకు వాదంలో జయించుట మంచిదంటారేమో. అది మంచిదికాదని చెప్పుచున్నారు. ''బుధజనైః వాదః పరత్యజ్యతాం'' బుధజనైః=పండితులతో, వాదః=వివాద, పరిత్యజ్యతాం=విడిచిపెట్టబడుగాక. విజయంకలిగితే, నా అంతవాడు లేడని అహంకారం, అపజయం కలగితే దుఃఖం మరల జయించవలెనని పట్టుదల కలుగును కనుక, శాంతికి భంగహేతువుగను, పండితులతో వాదించుట పనికిరాదని యర్థము.

తాత్పర్య వివరణం.

వేదాంతవాక్యములకు అర్థనిచారం బాగా చేయవలెను శ్రవణమననములే వేదాంతవిచారమనగా సమస్త వేదాంతవాక్యములకు అద్వితీయ బ్రహ్మయందు తాత్పర్య నిర్ణయంకొరకుచేయు మానసికవ్యాపారమే. వేదాంత వాక్యములనువిని అర్థమును విని ఈ పదములకు వాచ్యార్థమేమి, లక్ష్యార్థమేమి, మామూలుగావుండే వాచ్యార్థమనువదలి లక్ష్యార్థమునుగ్రహించుటలో కారణమేమి? ఉపనిషత్తు మొదల యేమని ప్రారంభించినది? యే అర్థంలో పూర్తిచేసినది, మధ్యలో ఏమిచెప్పినది? ఇందులో అపూర్వ విషయమేమి? ఫలమేమి? ఇందులో ఉన్న వాక్యములు యే అర్థమును బలపరచుచున్నవి. ఈ ఉపనిషత్తు చెప్పిన అర్ధం యుక్తికి సరిపోవునా అని చక్కగా విచారించవలయును. గాని పురాణకథలవలె, ఇతిహాసములవలె వినోదకరంగా సులభంగా అర్థమయ్యే విషయంకాదు. గనుక వేదాంతంశ్రవణం ఇతర శ్రవణములకంటే శ్రమసాధ్యమని గ్రహించవలసియుండువు.

ఈ ఆధ్యాత్మిక విద్య అర్థమయితేమాత్రం చాలా ఆనందం కలుగుననుటలో సందేహంలేదు. అందులోకూడా మహావాక్యములు, ఓ జీవుడా! నీవు బ్రహ్మస్వరూపుడవని, బ్రహ్మైక్యమును బోధించుచున్నవి. జీవేశ్వరులకు నిజంగా భేదముంటే, ఆ భేదమును తీసివేయుట, జీవేశ్వరులకు అభేదం సంపాదించుట ఎవరికిని శక్యంకాదు, ఉపనిషత్తులకును శక్యం కాదు. అందువలన జీవేశ్వరులకుకల భేదం నిజమైన భేదంకాదు. ఉపాధులవలన ఏర్పడిన భేదమేనని అనుకొనవలయును. బ్రహ్మవేత్త అయిన జీవుడు బ్రహ్మయగునని యున్నది. బ్రహ్మకు తెలుసుకున్నవ్యక్తి నిజంగా బ్రహ్మకంటే వేరు అయితే తెలుసుకున్నంత మాత్రంతో బ్రహ్మస్వరూపపు డెల్లాఅవుతాను. చాలాచోట్ల ఉపనిషత్తులు బ్రహ్మస్వరూపజ్ఞానం కలిగిన జీవుడు బ్రహ్మరూపు డగునని చెప్పుచున్నవి. పరమ ప్రమాణమైన వెదము చెప్పినవిషయం పరమార్థముగా గ్రహించవలసినవేగాని, అయథార్థమని, అప్రమాణమని బావించుట నరకమునకు కారణమగును గనుక వేద శాస్త్రములు చెప్పిన విషయములను అమూల్యములని గ్రహించవలెను.

అనేక స్థలములయందు జ్ఞానయవలననే మోక్షమని ప్రమాణ వచనములు చెప్పుచున్నవి. జ్ఞానంవలన మోక్షం లభించునని చెప్పినందువలన బంధం అజ్ఞాంవలన ఏర్పడినదని, బ్రహ్మజ్ఞానంవలన జీవుడు బ్రహ్మయగునంటే, స్వతః బ్రహ్మ అయినవానికి జీవత్వం అజ్ఞానంవలన ఏర్పడినదని స్పష్టముగా చెప్పినట్లే ఆకాశమునకు అనేకపాత్రలవలన నానాత్వ మేర్పడినట్లు. ఆకాశమందున్న ఒక సూర్యునికి అనేక నీటిపాత్రలయందు అనేక ప్రతిబింబములుగా నానాత్వం ఎర్పడినట్లు సచ్చిదానంధరూపమైన, అద్వైతమైన పరమాత్మ అజ్ఞానకల్పితమైన అనేక అంతఃకరణలయందు (ప్రతిబింబించి) జీవరూపముతో నానాత్వమును పొందినట్లు కనుపించు చున్నది గనుక నానాత్వం సత్యం కాదు, ఏకత్వమే సత్యం. అనగా ఆకాశం ఏకమనుమాటయే సత్యంగాని, నానాయన్నది ఔపాధికమే. సూర్యుడు ఒకడనునదే సత్యంగాని, నానాయను విషయను విషయం ఔపాధికమే.

అట్టి పరమాత్మయే భ్రమకు అధిష్ఠానం గనుక. అజ్ఞాతమైయున్నది సాక్షియేగనుక. దృశ్యంకాదు. అందువలన నిర్గుణము. గనుకనే యే పదమునకు వాచ్యార్థము కాదు. గనుకనే మహావాక్యంలోచేరిన తత్పదమునకు మాయోపాధికుడైన ఈశ్వరుడే అర్థమని చెప్పిత్వం పదమునకు అంతఃకరణోపాధికుడగు జీవుడే యర్థమనిచెప్పి, ఇవి వాచ్యార్థములనిచెప్పి జీవేశ్వరుల కిద్దరికి చైతన్యస్వరూపముతో అభేదమనే చెప్పి ఉపాధులద్వారానే భేదమేర్పడినదనిచెప్పి ఆ వుపాధులు ఆరోపితములేగాని పరమార్థములు కావనిచెప్పి, భేదమునకు కారణమైన ఉపాధులను విడిచిపెట్టినయడల చైతన్యమే మిగులును గనుక. అదియే లక్ష్యార్థమని పరమార్థమని జీవ బ్రహ్మైక్యమని మహా వాక్యార్థమును అతి విపులముగా, అతి గంభీరంగా శాస్త్రకర్తలు, శంకరభగవత్పాదులవారును ప్రతిపాదించిరి.

బ్రహ్మభావమే ముక్తి. ఇదియే లక్ష్యస్వరూపము. గనుక అతి భక్తిశ్రద్ధతో మహాపెద్దల వచనములను, వేదాంతములను గ్రహించి తరించవలయునని తాత్పర్యము. శృతులనే పరమప్రమాణముగా గ్రహించవలయునుగాని, కేవలయుక్తులను పరమప్రమాణముగా గ్రహించకూడదు. ఈ విషయంలో తార్కికుల సిద్ధాంతం. జీవులు ప్రతిశరీరంలో వేరువేరుగా నున్నారు. అనేకమంది జీవులని యర్థము. అందువలననే ఒకడు సుఖమును అనుభవించును, మరియొకడు దుఃఖమును అనుభవించు చుండును. అందుచేత ఆత్మలు అనేకములుగా నున్నవికాని ఆత్మ ఒకటే కాదు. కర్తృత్వం ఆత్మకేగాని అచేతనమునకు కర్తృత్వం లేదు. అనుభవమునుబట్టికూడా ఆత్మకేగాని అచేతనములకుకాదు. అచేతనములకు కర్తృత్వ ముండేయడల రాళ్ళకుకూడా కర్తృత్వ ముండవలసి వచ్చును.

మోక్షము సుఖరూపముకాదు. సుఖం ఎప్పుడు దుఃఖముతో కూడి యుండును గనుక అది విడిచిపెట్ట తగనదియేగాని గ్రహించతగినది కాదు గనుక పురుషార్థము కాదు. దుఃఖ నివృత్తియే పురుషార్థమని చెప్పవలయునని తార్కికులు చెప్పెదరు. కాని శృతి సమ్మతంకాదు. కామము సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ మొదలయినవన్నియు మనస్సేనని శృతి చెప్పుచున్నది. కర్తృత్వభోక్తృత్వములు ఉపాధి ధర్మములేకాని మనోధర్మములు కావు, ఆత్మసన్నిధానమువలన దేహేంద్రియములకు కర్తృత్వ భోక్తృత్వములుండును. తాదాత్మ భ్రమవలన ఆత్మయందున్నట్లు భాసించుచుండును. ఆత్మ ప్రతిబింబంలేని జడవస్తువులకు కర్తృత్వం ఉండదు. ఒకడు సుఖి, ఒకడు దుఃఖి యనుభేదం, ఉపాధి యగు దేహేంద్రియ మనస్సుల తేడానుబట్టియే కుదురును, వైషయిక సుఖం దుఃఖంతో కూడియున్ననూ ఆత్మసుఖం సర్వదుఃఖరహితమని శృతి తాత్పర్యమును గ్రహించవలయును.

ఆత్మ స్వప్రకాశానందరూపమని, దుఃఖరహితమని, సర్వాతీతమని శృతులు చెప్పుచున్నవి గనుకను, యుక్తికిని సరిపోవుచున్నవి గనుకను, ఉపాధిభేదముచేతనే ఆత్మకు నానాత్వమని ఉపాధిభేదముచేతనే సుఖీ దుఃఖీ అనే తేడాలును కుదురునని, బంధమోక్షవ్యవస్థకూడా కుదురుననియు అద్వైతులు చెప్పెదరు. అద్వైతుల యుక్తులు శృతిసమ్మతమైన యుక్తులు. తార్కికులు చెప్పేయుక్తులు శృతికి విరుద్ధమైన యుక్తులు గనుక, ఆ తర్కములను విడిచి అద్వైతులు చెప్పినశృతికి అనుకూలమైనతర్కమునే గ్రహించి మననంచేయమని తాత్పర్యము.

శ్రవణ మననములు చేసి అసంభావనా విపరీతభావనలను పోగొట్టుకొని నేను సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపుడనేయని ధ్యానంచేయవలయును. ధ్యానంచేయుచుండగా సర్వపాపములు నశించును. మనస్సు పరిపాకస్థితికి వచ్చునుగాని సంస్కారమువలన నేనే గొప్పవాడ ననే అహం కారం కలుగవచ్చును. అట్టి అహంకారం తత్వానుసంధానముతోనేలేకుండా చేసుకొనవలయును. బ్రహ్మధ్యానంనుండి మనస్సు దిగజారి దేహేంద్రియములయందు నేననే అభిమానమును పొందకుండా నేను దేహేంద్రియ స్వరూపుడను కానని భావిస్తూ అవి ఆత్మకంటే వేరుగా లేవనికూడా భావిస్తూ దేహాభిమానం లేకుండా చేసుకొనవలయును. ఈ అద్వైతదృష్టియందున్న ఆదరంతో, మతాంతరులతో వివాదం పనికిరాదు. ఆ వివాదం రాగద్వేషములకు కారణమై అద్వైతభావననుండి ప్రపంచభావనలోకి లాగి వేయునుగనుక బహుజన్మవాసనవలన కలిగిన ద్వైతదృష్టిని వదలుట, అద్వైతదృష్టిని సంపాదించుట చాలా కష్టతరం గనుక ఈ సాధనసంపత్తిని సంపాదించి కృతకృత్యుడవు కావలయునని ఒక గురువు శిష్యునికి ఉపదేశించినట్లు శంకర భగవత్పాదులవారు మన కుపదేశించిరని గ్రహించవలయును.

అవతరణిక.

ఆత్మవిచారం జ్ఞానసాధనమే మంచిదేకాని, ఆకలి మొదలగు బాధలవలన ఆహార స పాదనయందైననుప్రవర్తించవలయునుకదా ఈవిధంగా ప్రవృత్తి కలిగితే మనస్సుకు నిశ్చలత్వం ఎట్లు కలుగును అనే ప్రశ్నకు సమాధనం వ్రాయుచున్నారు.

శ్లో || క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతా మనుదినం భిక్షాపథం భుజ్యతాం |

స్వాద్వన్నం నతుయాచనతాం విధివశాత్ర్పాప్తేన సంతుష్యతాం |

ఔదాసీన్య మభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్య ముత్సృజ్యతాం |

శీతోష్ణాది విషహ్యతాం నతువృధావాక్యం సముచ్చార్యతాం ||

ప్రతిపదార్థ నిరూపణము

క్షుద్వ్యాధిశ్చ చికిత్సతాం =క్షుద్వ్యాధిః (వ్యాధిరివక్షుత్‌ క్షుద్వ్యాధిః) వ్యాధిలాంటి ఆకలి, చికిత్స్యతాం=చికిత్పచేయబడుగాక, లేక క్షుత్‌ చికిత్స్యతాం, క్షుత్‌=ఆకలి, చికిత్స్యతాం=చికిత్సచేయబడుగాక, వ్యాధిశ్చ=జబ్బుకూడా, చికిత్స్యతాం=చికిత్స చేయబడుగాక, ఆకలికి, వ్యాధికి చికిత్స చేసినను మాటిమాటికి వస్తుంటుంది కదా అంటే, అనుదినం భిక్షాపధం, భుజ్యతాం, అనుదినం =ప్రతిరోజూ, భిక్షౌపధం=ఔషధంలాంటి భిక్ష. భుజ్యతాం=తినబడుగాక, లేక భిక్ష ఔషధం రెండు, భుజ్యతాం =తినబడుగాక, వ్యాధికి చికిత్సచేసి శరీరమును నిలుపుకున్నట్లు, ఆకలికి చికిత్స=అనగాతగిన ఆహారమునే భుజించి శరీరమును నిలుపుకొనవలెనని యర్థము. లేక శరీరమును నిలబెట్టుకొనుటకు జీవించి యున్నంతవరకు రుచిని విచారించకుండా హితమైన ఆహారంతో శరీరమును పోషించుకొనవలయును. వ్యాధి సంభవించినపుడు వ్యాధి తగ్గేంతవరకు మందుపుచ్చు కొనవలయుననికూడా యర్థము.

సర్వసంగ పరిత్యాగి అయినను, సన్యాసి అయినను హితమైన, పరిమితమైన, పవిత్రమైన ఆహారముతో శరీరమును పోషించుకొనుచు అనారోగ్యము కలిగినపుడు మందుపుచ్చుకొనుచు, శరీరమును రక్షించుకొనుచు పరమార్థమును సంపాదించవలయునని అర్థము. వ్యాధి తగ్గుటకు రుచి అయిన మందులే కావాలంటే కుదురదుగాని, రుచిగల పదార్థములను సంపాదించి భుజించి ఆకలిని తగ్గించుకొనవచ్చునుకదా అంటే "స్వాద్వన్నంనతు యత్వాతాం (యాచ్యతాం)" స్వాదు = రుచియైన, అన్నం = పిండి వంటలు, అన్నం, పులుసు, పప్పు కూరలు మొదలగు ఆహారం, నతుయత్యాతాం = యత్నింపబడకుండుగాక, రుచియైన ఆహారంకొరకు యత్నించడంలో నిశ్చలస్థితి పోవునుగనుక జ్ఞానాభ్యాసమునకు భంగం కలుగునని యర్థము. పురుషప్రయత్నం లేకపోతే ఆహారం ఎట్లు లభిస్తుందంటే, "విధివశాత్‌ ప్రాప్తేన సంతుష్యతాం" విధి = పూర్వజన్మయందు చేసిన కర్మయొక్క, వశాత్‌ = పరిపాకస్థితివలన, ప్రాప్తేన = లభించిన ఆహారముచేత, సంతుష్యతాం = సంతోషింపబడుగాక, రుచియైన ఆహారమును కోరక కర్మ ననుసరించి లభించిన ఆహారంవలన శరీరమును రక్షించుకొనుచు పరమార్థమును సాథించమని యర్థము.

మంచి వచ్చినపుడు సుఖం చెడు వచ్చినపుడు దుఃఖం కలుగును కదా అంతట సమానభావం ఎట్లాకుదురును. అంటే "ఔదాసీన్య మభీప్స్యతాం ఔదాసీన్యం = ఉదాసీనస్థితి, అనగా ఊరకయుండుట, అభీప్స్యతాం = కోరబడుగాక, మంచి కలిగినపుడు పొంగిపోవుట, చెడుకలిగినపుడు దీనస్థితిని పొందుట లేకుండా వుండవలయునని ఈ స్థితిని సంపాదించుచు అభ్యాసం చేయమని యర్థము. నా స్వవిషయంలో లాభాలాభములయందు సమానభావముచేత ఊరికయున్నను, పరులయందు దయగాని, ఒకరికి మరియొకరు అపకారంచేయునపుడు కఠినభావంతో నివారించుటగాని అవసరంకదా, సమభావ మెట్లు కలుగునంటే, "జనకృపానైష్ఠుర్య ముత్సృజ్యతాం" అని చెప్పిరి. జన = జనులయందు, కృపానైష్ఠుర్యం, క్పపా = దయ, నైష్ఠుర్యం = కఠినమైన సంభాషణ, (ఈ రెండు) ఉత్సృజ్యతాం = విడిచిపెట్టబడుగాక, ఇతరుల విషయములోనైనను దయాభావముతోగాని, కఠినభావముతోగాని ప్రవర్తించి తన విశ్చలస్థితికి భంగం కలిగించకూడదని యర్థము.

ఇవి నివారించుకున్నను శీతోష్ణాదులవల్ల దుఃఖంతప్పుదుకదా అంటే "శీతోష్ణాది విషహ్యతాం" శీత = చల్లదనము, ఉష్ణ = వేడి, ఆది = మొదలగు, మానావమానస్థితి, విషహ్యతాం = విశేషంగా సహింపబడుగాక, అనగా గొప్పచలి, ఉగ్రమైన ఎండలు మానావమానాదులు సంభవించినపుడు సహించవలయునని యర్థము. ఎవరయినా మాట్లాడిస్తే మాట్లాడవలయును కదా ఆ సంభాషణవలన నిశ్చలస్థితి చెడునేమోనంటే "నతు వృధావాక్యం సముచ్ఛార్యతాం" వృధా = వ్యర్థముగా, వాక్యంతు = వాగ్జాలము, నసముచ్భార్యతాం = ఉచ్ఛరింపబడకుండుగాక, అనగా మనశ్శాంతికి భంగకరంగా అనవసరంగా యేమాటలు మాట్లాడకూడదని యర్థము.

తాత్పర్య వివరణము.

సర్వకర్మసన్యాసంచేసి జ్ఞానమార్గమందు ప్రవేశించిన ఉత్తమాధి కారులకు కూడా శరీరమును రక్షించుకొనుట అవసరమే. జ్ఞానమును సంపాదించుటకు సాధనమైన శకీకమును రక్షించుకొనుటకు మాత్రమే ఆహారం అనే దృష్టితో పవిత్రమైన, పరిమితమైన విరుద్ధంకాని ఆహారమును తీసుకుంటూ వుండవలయును. శరీరమును రక్షించుకుంటూ యుండవలెను. రోగములు వచ్చినపుడు మందులువాడి రోగములను పోగొట్టుకొనుటకూడా అవసరమే సన్యాసికికూడా. శరీరం బాగుగా లేనిది జ్ఞానాన్ని సాధించలేడుకదా. ఔషధం ఏ ప్రకారంగా రుచిగా నున్నదా లేదా యని విచారించకుండా వ్యాధిపోయి ఆరోగ్యంగా నుండుటయే ప్రధానమని పుచ్చుకుంటున్నారో అటులనే ఆహారంకూడా రుచిగా నుండవలయునని పిండివంటలు మొదలగు పదార్థములు కావలయుననికోరి కలతో కాలహరణం చేయుచు, ఆ భోజనంవల్ల కలుగు సుఖమునేప్రధానం చేయక, ఆకలి తీరి, శరీరం సురక్షితంగా నుండుటయే ప్రధానమనుకొని ఆహారమును భుజించమని తాత్పర్యము.

భిక్షాటనకు వెళ్ళినపుడు యేదిలభించునో దానినే భుజించి తృప్తిపడవలయునని తాత్పర్యము. గృహస్థులు రుచికరమగు పదార్థములు పెట్టినను తనస్థితికి భంగంకాకుండావుండే ఆహారమునే పుచ్చుకొనవలయును. దయతో ఒకరిని బాగుచేయవలయుననిగాని, పరస్పర విరోధముతో ఒకరు మరియొకరిని బాధించుచున్నపుడు ఒక పక్షంలోచేరి అపకారం చేసేవారి మీద కక్షగట్టి కఠినంగా మాట్లాడుట వాళ్లకు అపకారం చేయుట. తన మోక్షమార్గమునకు ప్రతిబంధకములుగనుక పనికిరాదు. తనకు ధర్మం కాదని తాత్పర్యము. తనను పూజించినపుడు పొంగిపోవుట, పూజించిన వారియందు విశేషాభిమానం తమను నిందిస్తే విచారపడుట. నిందించిన వారిమీద క్రోధం ఇవిలేకుండా మానావమానములు సంభవించినపుడు తోట్రుబాటులేకుండా నిశ్చలముగా నుండవలయును.

కావలెనని శీతంలోకి, యెండలోకి పోయి సహించే అభ్యాసం చేయనవసరంలేదు. కాని, ఆయా కాలములయందు చలిగాని, యండగాని, తటస్థించినపుడు వ్యనసపడకుండా సహనమును అభ్యసించమని తాత్పర్యము. అతి సంభాషణలేకుండా మౌనముగా నుండి ఈ సాధనసంపత్తిని రక్షించుకొనుచు పరబ్రహ్మానుభవమును పొంది ముక్తులు కావలయునని తాత్పర్యము.

ఎవరితో విశేషసంభాషణలేకుండా మౌనంగావుండుట నా కెట్లు లభించునంటే.

శ్లో || ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం |

పూర్ణాత్మాసు సమీక్ష్యతాంజగదిదం తాద్బాధితందృశ్యతాం

ప్రాక్కర్మాపి విలావ్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్ల్శిష్యతాం |

ప్రారబ్ధం త్విహభుజ్యతా మధ పరబ్రహ్మాత్మ నాస్థీయతాం ||5 ||

ప్రతిపదార్థ నిరూపణము.

ఏకాంతే = ఎవరులేని ప్రదేశమందు, సుఖం = సుఖముగా, అస్యతాం వుండబడుగాక, అనగా యేకాంతమునకు వెళ్ళియుండుమని అర్థము. నిర్జన ప్రదేశమందున్న యడల మౌనమునకు భంగంలేకుండా వుండునుగనుక ఏకాంతవాసము ముఖ్యసాధనమని యర్థము. ఏకాంతమందున్నను మనస్సు విషయములను ఆలోచించునుకదా యంటే "పరతరే చేతస్సమాధీయతాం పరతరే = సర్వాతీతమగు పరబ్రహ్మయందు, చేతః = మనస్సు, సమాధీయతాం = బాగుగా వుంచబడుగాక, ఇతరవిషయములమీదికి మనస్సును పోనివ్వకుండా పరమాత్మయందే నిలిపి బ్రహ్మనుసంధానంచేయమని యర్థము.

బ్రహ్మస్వరూపజ్ఞానం లేనిది ధ్యానంచేయుట ఎట్లు. ప్రయెజనమేమిఅంటే "పుర్ణాత్మాసుసమీక్ష్యతాం" పూర్ణాత్మా. పూర్ణ = వ్యాపకమయిన ఆత్మ = పరమాత్మ, సుసమీక్ష్యతాం = చూడబడుగాక, తెలుసుకొని ధ్యానం చేసి అపరోక్షానుభూతిని సంపాదించుమని భావము. ఆత్మప్రపంచముండగా పరిపూర్మ మెట్లగునంటే జగదిదం తద్బాధితం దృశ్యతాం (త్యజ్యతాం) ఇదం = ఈ కనిపించే, జగత్‌ = ప్రపంచము, తద్బాధితం, తత్‌ = ఆ పరమాత్మ జ్ఞానముచేత, బాధితం = నశింపచేయబడినదిగా దృశ్యతాం = చూడబడుగాక, పరమాత్మ జ్ఞానముచేత ఆరోపిత ప్రపంచమంతయు నశించును గనుక ఆత్మ పరిపూర్ణమగుటలో విరోధంలేదని యర్థము.

పూర్వజన్మలయందు చేసిన కర్మలు ఆ జన్మలోనే ఫలమునివ్వక, జ్ఞానికికూడా జన్మల నివ్వవచ్చునుకదా అంటే "ప్రాక్కర్మ ప్రవిలాప్యతాంచితి బలాత్‌ చితిః అనగా ఆత్మజ్ఞానం, దానియొక్క బలాత్‌ = సామర్థ్యం వలన, ప్రాక్కర్మ = వెనుకచేసినకర్మ, ప్రవిలాప్యతాం = దహింపచేయబడుగాక, అనగా ఆత్మసాక్షాత్కారమువలన వెనుకచేసిన సంచిత కర్మఅంతయు నశించునుగనుక, మరల జన్మ రానేరదని యర్థము. వెనుక చేసిన కర్మలు జ్ఞానముచేత దగ్ధములయినవి గనుక వాటివలన జన్మ రాకపోవచ్చునుకాని. జ్ఞానం కలిగిన తరువాత చేసేకర్మలవలన మరల జన్మ రావచ్చునుకదా అంటే, చితి బలాన్నాప్యుత్తరైఃశ్లిష్యతాం, చితిబలాత్‌ అనేపదం, ఈవాక్యంలో వెనుకవాక్యంలోకూడా అన్వయించవచ్చును.

చితిజలాత్‌ = ఆత్మసాక్షాత్కార బలంవలన ఉత్తరై ఆగామి కర్మలతోకూడా అనగా జ్ఞానంకలిగిన తరువాత చేసే కర్మలతోకూడా నశ్లిష్యతాం = సంబంధం పొందబడకుండా వుండుగాక. అనగా జ్ఞానబలంవలన ఆగామి కర్మల సంబంధంలేకుండా చేసికొనుము. అనగా జీవత్వభ్రమయే పోయినది గనుక కర్తృత్వములు నశించునుగనుక సంచితమును నశించును. ఆగామి = అంటదు అని అర్థము. అయితే జ్ఞానం వల్ల పూర్వకర్మలన్ని పోతే ఈ శరీరమునకు కారణమైన కర్మకూడా పోవును గనుక జ్ఞానం కలిగిన వెంటనే ఈ శరీరం పడిపోయి విదేహ కైవల్యం రావలసి వచ్చునుకదా అంటే ప్రారబ్ధం త్విహభుజ్యతాం.

ఇహ = ఈ శరీరమందు, ప్రారబ్ధంతు = ఫలమునిచ్చుటకు ఆరంభించిన కర్మ, భుజ్యతాం = అనుభవింపబడుగాక, ఈ శరీరమును కలుగచేసిన ప్రారబ్ధకర్మను అనుభవించవలసినదే. ఇదియే ప్రారబ్ధం. ఈ కర్మ ఉన్నంతవరకు దేహముండును. అందువల్లనే జీవన్ముక్తు డంటారు. దేహం పోగానే విదేహముక్తుడగునని భావము. ఆత్మజ్ఞానంవల్ల పాపములు పోవచ్చును. కాని మోక్షసిద్ధి ఎట్లాగంటే అథ పరబ్రహ్మాత్మ నా స్థీయతాం అథః ఈ ప్రారబ్దకర్మ పోయినతరువాత పరబ్రహ్మాత్మనా = పర బ్రహ్మ స్వరూపముచేతనే. స్థీయతాం = ఉండబడుగాక, జ్ఞానం కలుగగానే బ్రహ్మభావమును పొందునుగాని విదేహముక్తిమాత్రం ప్రారబ్ధం. అది మూలముగాగల ఈ దేహంపోగానే వచ్చునని, అట్టి పరబ్రహ్మ స్వరూపస్థితియే పరమ మోక్షమని అట్టి మోక్షమునకు బ్రహ్మసాక్షాత్కారమే సాధనమని అట్టి జ్ఞానమునకు వెనుక చెప్పబడిన సాధనములన్నియు సాక్షాత్తుగా కాని పరంపరగాకాని సాధనములని యర్థము.

తాత్పర్య వివరణము.

సాధకునకు ఎవరులేని నిశ్శబ్దముగానుండు యేకాంత ప్రదేశమందుండుట చాలా అవసరం. గొప్ప సాధనం, మాట్లాడుటకుకూడా యెవ్వరు ఉండరుగనుక మౌనముగా నుండుట తటస్థించును. (వాఙ్మౌనం, మనోమౌనం, కాష్ఠమౌనం, సౌషుప్త్యమౌనం అని మౌనం నాలుగు విధములు. వాఙ్మౌనమనగా నోటితో మాట్లాడకుండా ఉండుటయే, అత్మకంటే భిన్నవిషయములలో సంభాషించకపోవుటకూడా వాఙ్మౌనంలో చేరును. మనోమౌనం అనగా ఆత్మకంటే భిన్నమైన ప్రపంచవిషయ చింతన లేకుండా వుండుటయే అనగా విషయాకారవృత్తులు లేకుండా వుండుట కాష్టమౌనమనగా శరీరమునుకదలకుండా. నిశ్చలంగానుంచుకొనుటయే సౌషుప్తమౌనమనగా గాఢనిద్ర పోయినపుడు ఏవిధమైన మనోవృత్తులు లేకుండా వుండును. ప్రపంచదృష్టి లేకుండా నుండును, ఇదియే సౌషు ప్త్యమౌనము గనుక సౌషు ప్త్య మౌనమందు వాఙ్మౌనము, కాష్ఠమౌనము, మనో మౌనము సిద్ధించియున్నవి, చేరియున్నవి. ఆ దశలో జీవుడు ప్రపంచాతీతుడైనట్లే.

అటులనే ఆత్మసాక్షాత్కారము కలిగినతరువాత ఆత్మను ఆవరించిన సర్వభ్రమలకు కారణమైన అజ్ఞానం పోయినపుడు అన్నియు నశించి పోవును. శరీరంతో తాదాత్మ్యభ్రమయు, ఇంద్రియముతో తాదాత్మ్యభ్రమయు, మనస్సుతో తాదాత్మ్యభ్రమయు అన్నియు పోవును. ఆ ముక్తి దశయందుండు స్థితియే సౌషుప్త్యమౌనము జ్ఞానదశయందు అజ్ఞానుల దృష్టికి జ్ఞాని మాట్లాడినట్లున్నను, తిరిగినట్లున్నను. రాజ్యపరిపాలన చేసినట్లున్నను, ఏపనిచేసినట్లున్నను జ్ఞానికి అన్నివుపాధులతో తాదాత్మ్యభ్రమ పోయినదిగనుక, కూటస్థ బ్రహ్మరూపుడై యున్నాడు గనుక, శరీరేంద్రియముల వ్యాపారం తనకు సంబంధించదు కనుక, జ్ఞాని యెప్పుడూ మౌనముగా నున్నట్లే.

ఈ శ్లోకంలో శంకరభగవత్పాదులవారు సాధనతోపాటు జీవన్ముక్తుని, విదేహముక్తిని చెప్పిరి. పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదితం తద్బాధితం దృశ్యతాం. అని. దేశకాలవస్తుపరిచ్ఛేదరహితమైన, సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ సాక్షాత్కారము కలిగిన తరువాత జగత్తు బాధితమగుననిరి. అనగా నశించునని యర్థము. దీపం వెలిగిస్తే చీకటి పోయినట్లు, పరమాత్మ జ్ఞానంకలిగితే పరమాత్మను ఆవరించిన అజ్ఞానం పోవును గనుక, అజ్ఞానంతో, సహా జీవత్వభ్రమతో సహ జగత్తు నశించునని యర్థము. జ్ఞానికి జ్ఞానమనే అగ్నివలన అగ్ని స్పర్శ అయ్యేసరికి రెల్లు వెన్ను ఎట్లు భగ్గున మండిపోవునో, అట్లే సంచిత కర్మలన్నియు మండిపోవును. అనగా నశించుననియర్థము. దేహేంద్రియములతో తాదాత్మ్యభ్రమ పోయినందువలన జ్ఞానం కలిగిన తరువాత ఆభాసగా పామరులదృష్టికి జ్ఞానికర్మలు చేయుచున్నట్లు కనిపించినను ఇతర శరీరములు చేసిన కర్మలు తనకు ఎట్లా అంటవో ఇదివరకు నాదని అనుకున్న జ్ఞాని శరీరంచేసిన కర్మలుకూడా జ్ఞానికి అంటవు.

ఈ శరీరముండుటనుబట్టి ప్రారబ్దకర్మ ఉన్నదని చెప్పవలయును. ఈ శరీరాన్ని పుట్టించి, ఈ శరీరంలో సుఖ దుఃఖములను కలుగచేయు కర్మయే ప్రారబ్దంకదా. ఈ శరీరం వున్నంతవరకు మాత్రమే వుండును. ఒక లక్ష్యం మీద బాణములు వేయువాడు, చేతికి తీసుకున్న బాణములను వేయకుండా వదలివేయవచ్చును. మరియు వేయబోయేవి వేయకుండా మానవచ్చును. ధనుస్సు మీద ఎక్కు పెట్టిన బాణమును కూడా వదలివేయవచ్చును కాని, ధనుస్సు నుండి వేగంగా విడిచిన బాణమును మాత్రం ఆపుటకు స్వాధీనంకాదు. దాని వేగమున్నంతవరకు వెళ్లి పడిపోవలసినదే. అటులనే ప్రారబ్ద కర్మఫలము నిచ్చుటకు, విడిచిపెట్టబడినదిగనుక ప్రారబ్దవేగమున్నంతవరకు ఈ శరీరముండును. కాని దేహాభిమానం కలిగిన అజ్ఞాని హర్షవిషాదములను సుఖ దుఃఖములను పొందినట్లు జ్ఞాని హర్ష విషాదములను పొందడు. బ్రహ్మానందమునే అనుభవించుచుండును. విలాసముగా చూచుచుండును. ఈ విషయమునే ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్దంత్విహభుజ్యతాం అని చెప్పుచూ సూచించిరి. "అథ పరబ్రహ్మాత్మనా స్థీయతాం" అని, ప్రారబ్దవేగం పోయినతరువాత జ్ఞాని శరీరం పడిపోవునుగనుక విదేహ కైవల్యమును పొందును. సచ్చిదానంద స్వరూపుడగునని యర్థము.

మోక్షము ఆత్మ రూపమేగనుక, సిద్ధమైగాని, సాధ్యముకాదు. ఆజ్ఞాతమై యుండుటచేత లేనట్లున్నది. అజ్ఞానికి జ్ఞానం కలిగితే అజ్ఞానం నశించునుగనుక, అజ్ఞాననివృత్తి, జ్ఞానముచేత సాధ్యమైయున్నది గనుక మోక్షముకూడా సాధింపబడినదని భావిస్తున్నారు. జీవత్వం, ప్రపంచం, అజ్ఞానమూలక భ్రమవలన యేర్పడినట్లున్నవి గనుక జ్ఞానంకలిగితే పోయినట్లున్నవేగాని వేరు కాదుగనుక బ్రహ్మసత్యం, జగన్మిధ్యా అనే అద్వైత సిద్ధాంతమును తెలుసుకున్నపుడు ఆశ్చర్యం కలుగును. ఈ విషయములను వెనుకటి స్తోత్రముక్రింద వ్రాసియుంటిని. అయినను వేరుగానున్న స్తోత్రములలో శంకరభవత్పాదులవారు అనుగ్రహంతో మరలమరల చెప్పిరికూడా. అందుచేతను గంభీరమైన విషయముగనుకను సంస్కృత భాషాపరిచయం లేనివారికి కూడా దృఢమైన సంస్కారం కలుగుటకు మరల వ్రాసితిని.

ఇట్లు వ్రాయకపోతే ఈ శ్లోకంలో యీ అర్థం లేదని కొందరు అనుకొనవచ్చును. అందుచేత పునరుక్తిగా గ్రహించకుందురుగాక యని తలుస్తాను. శ్రీమద్వైతోపదేశ పంచరత్నములనే సోపాన పంచకస్తోత్రములో మొదటినుండి క్రమముగా ఒకమెట్టు తరువాత మరియొకమెట్టు ఎక్కుటకు వీలుచేసినట్టి సాధన పరంపరను చెప్పిరి. అర్థజ్ఞాన సాధనమైన శాస్త్రముతోసహ వేదమును నిత్యం చదువవలయును. ఆ వేదోక్తకర్మలను ఈశ్వరార్పణ బుద్ధ్యా చేయవలయును. ఇట్టి నిష్కామకర్మవలన జ్ఞాన ప్రతిబంధకమైన పాపములను పోగొట్టుకొనవలయును, తరువాత వైరాగ్యం కొరకే విషయసుఖములను దోషదృష్టితో విడచి పెట్టవలయును. పరమాత్మను తెలుసుకుందామనే జిజ్ఞాసను బలముగా సంపాదించవలయును. విషయములయందు విరక్తుడై, తత్వజిజ్ఞాసకలవాడై యిల్లు (భార్యా పుత్రాదులను వదలి అభిమానమును వదలి) వెళ్లి తత్వ విచారము చేయు మహాత్ములతో సహవాసం చేయవలయును.

దృఢమైన భగవద్భక్తినికూడా సంపాదించవలయును. శమదమాది సంపత్తినికూడా సంపాదించవలయును. కర్మసన్యాసం చేయవలయును. అనగా సన్యసించవలయును, వెనుకటి సామాన్య సజ్జనసాంగత్యము కాక, బ్రహ్మనిష్ఠులైన విద్వాంసులైన సద్గురువులవద్దకు వెళ్లవలయును. వారికి అనుగ్రహం కలిగేటట్లు వారి పాదసేవ చేయవలయును. వారియనుగ్రహం సంపాదించి, బ్రహ్మతత్వమును చెప్పమని యడుగవలెను. వారి వలన వేదాంత వాక్యములను మహావాక్యములను అర్థముతో వినవలయును. అసంభావనా విపరీతభావనలు పొయ్యేంతవరకు మహావాక్యార్థమైన జీవబ్రహ్మైక్యవిచారం చేయవలయును. శృతులకు విరుద్ధమైన మతము లను ఆశ్రయించకుండా శృతిసమ్మతమైన అద్వైతసిద్ధాంతమునే ఆశ్రయించవలయును.

శృతులకు విరుద్ధమైన యుక్తిరూపమగు తర్కమును వదలివేయవలయును. శృతులకు సమ్మతమైన యుక్తులనే గ్రహించవలయును. మననం చేయమని యర్థము. తరువాత, నేను బ్రహ్మస్వరూపుడనని ధ్యానం చేయవలయును. నేను జ్ఞానినికదా యని అహంకారమును వదలి వేయవలయును. దేహేంద్రియములయందు నేననే భ్రమను వదలివేయవలయును. ఇతర మతస్థులైన విద్వాంసులతో వివాదమును వదలుము. నిత్యం భిక్షాటన చేత లభించిన ఆహారముతో ఆకలిని శమింపచేసుకొనుము. అనారోగ్యం కలిగినపుడు ఔషధసేవచేసి శరీరం నిలబెట్టుకొనుము. ఔషధ సేవవలెనే భిక్షాభోజనంకూడా శరీరమును రక్షించుకొనుటకేకాని, భోగప్రధానముగా రుచియైన పదార్థములను కోరకూడదు. లాభాలాభముల యందు సమానబుద్ధితో ప్రవృత్తిలేకుండా ఊరికే ఉండవలయును. తన తత్వనిష్ఠకు ప్రతిబంధకంగా ఎవరియందును దయతోగాని, క్రోధముతో గాని కలుగచేసుకొనవద్దు. శీతోష్ణములను సుఖ దుఃఖములను సహించవలయును. వ్యర్థమైన సంభాషణలేకుండా మౌనము నవలంభించవలయును.

అట్టి మోక్షమును అభ్యసించుటకు నిర్జనప్రదేశమందు (నివసించ) ఉండవలయును. మౌనంగా నుండి పరబ్రహ్మ యందు మనస్సును నిలిపి ధ్యానం చేయవలయును. బ్రహ్మసాక్షాత్కారమును పొందవలయును. బ్రహ్మానుభూతిచేత సకలద్వైత భ్రమను నశింపచేసుకొనవలయును. ఆత్మజ్ఞానంవలన సంచిత కర్మరాశిని దహింపచేయుము. ఆగామిని అంటకుండా వుండుము. ఒక ప్రారబ్ధము మాత్రమే వుండునుగనుక అనుభవించుము. ఆ ప్రారబ్ధం పోయిన తరువాత పరబ్రహ్మరూపముగా నుండును. అని శ్రీశంకర భగవత్పాదులవారు యేస్థితినుండి యేయే స్థితికి వెళ్ళవలయునో యెట్లు ప్రయత్నించవలయునో, యేదిచేస్తే యేస్థితి కలుగునో విశదముగా నుపదేశించిరి. చెప్పిన దానినే మరల చెప్పినట్లున్నను పరిపాకదశ కలిగే కొలది ఇంకా ధ్యానం బాగుగా చేసితరించమని యర్థమును సమర్థించుచు గ్రహించవలయును. ఇది స్తోత్రంలో చెప్పిన సోపానసాధనలను వరుసగా చివర వ్రాసితిని.

ప్రతి మానవుడుకూడా ఆనందమును కోరవలసినదే, దుఃఖమును పోగొట్టుకొనవలసినదే. ఆనందమునకు సాధనమేమి? దుఃఖము పోవుటకు సాధనమేమని బాగుగా విచారించవలసిన విషయమే. ఆరోగ్య విషయంలో అందరు లోకంలో విచారిస్తున్న విషయమే. కొన్ని జబ్బులు సంభవించినపుడు ఈ జబ్బు యే మందువలన పోవును. యే మందువలన పుష్టి కలుగునని విచారింతురు. కొన్ని కష్టములు మానసికముగా గాని, శారీరకముగాగాని సంభవించినపుడు ఈ కష్టములు పోవు సాధనము లేవియని ఆందోళనపడి విచారింతురు. చాలా శ్రమపడి ఆయా సాధనములను సంపాదించి, అనగా లౌకికసాధనములనుగాని, అనగా ఔషధసేవచేయుట వినోదకరమైన దృశ్యములను చూచుట, వినుట మున్నగు సాధనములవలన మానసిక శారీరక కష్టములను పోగొట్టుకొనుచున్నారు. కొంత సంపత్తును సంపాదించినను తృప్తిలేక ఇంకను అధిక సంపత్తుకొరకుచాలా శ్రమపడుచున్నారు.

అట్టి అధికసంపద లభించినపుడు చాలా బాధపడుచున్నారు. ఇతరులు చాలా సంపున్నులై యున్నపుడు చూచి సహించలేక అసూయపడుచున్నారు. దాని మూలాన అకారణముగా సజ్జనులయందుకూడా ద్వేషమును పొందుదురుకాడా. ఈ ద్వేష మెందుకు కలిగినది. దీనివలన ప్రయోజనమేమి. కొన్ని పనులు చేసినపుడు ఈ పనులకు ప్రయోజనమేమి, దీనివలన మనకు శాశ్వతమగు ప్రయోజన మేమి కలుగును అని విచారింపవలయును. ఈ సోపాన పంచకములో చెప్పిన ప్రకారం తమకు చేతనయినంతవరకు స్వకర్మలను ఆచరించుచు, భగవంతునియందు భక్తికలగినయున్నయడల సర్వదోషములు, దుర్గుణములు పోవును. "భక్తి ర్దృఢా థీయతాం" అని చెప్పిరి గనుక భక్తిమార్గమును కూడా వదలకూడదు. సగుణ భక్తి, నిర్గుణ బ్రహ్మసాక్షాత్కారమునకు సాధనమగును.

వాక్యార్థశ్చ విచార్యతాం అని చెప్పిరి. మహావాక్యములయొక్క అర్థమును విచారించవలయును. స్వయముగా అర్థమును తెలుసుకొనలేక పోతే పెద్దలవలన వినవలయునుగాని అసంప్రదాయంగా విచారించకూడదు. ఉపనిషత్తుల పక్షమునే ఆశ్రయించమని చెప్పిరి. ఉపనిషత్తులకు సమ్మతమైన అద్వైతాత్మ విచారమే చేయవలయును. దానికి సూచకముగా బ్రహ్మాస్మీతి విభావ్యతాం అని చెప్పిరి. అనగా జీవబ్రహ్మైక్యమును బోధించుచు మహావాక్యార్థమునే ఈ వాక్యములో సూచించిరి.

ఈ సోపానపంచకములో వేదశాస్త్రాభ్యాసముతో నారంభించినిష్కామ కర్మానుష్ఠానం మొదలగు సాధనములను వరుసగాచెప్పి "పరతరే చేత స్సమాధీయతా" మని పరమాత్మయందు మనస్సును నిలుపుమనిచెప్పిరి. యల్లపుడు మనస్సు ప్రపంచవిషయములమీదికి వెళ్లే అభ్యాసములో నున్నదిగనుక ముందు పరమాత్మ స్వరూపమును తెనుసుకొని ప్రపంచ విషయములనుండి మనస్సును మరలుచుటయే ముందు చేయవలసిన అభ్యాసం. అటుల మరలించినపుడు నిద్రలోకి పోవును యెందుచేతనంటే మనస్సుకు ప్రవృత్తి ప్రపంచమందే కలుగును. నివృత్తి కలిగిన సుషుప్తి స్థితియే కలుగును. గనుక పరమాత్మయందు ప్రవృత్తి కలుగుట చాలాకష్టం. అందుచేత పరమాత్మయందు మనస్సును నిలుపుట సామాన్యమైన పనికాదు.

కొందరు ప్రశాంతగా కూర్చొని ఇదియే పరమాత్మభావనయని భ్రాంతి పడుదురుకాని అదికాదు. ముందు శ్రవణ మననములు బాగాచేయవలయును, శ్రవణ మననములవలన పరిపాకస్థితి కలిగిన తరువాత గాని, మనస్సు పరమాత్మయందు నిలబడదు. గనుక అంత సులభమని భ్రమ పడి సగుణ సేవను, సగుణధ్యానమును వదలిపెట్టకూడదు. అందువలననే శంకరభగవత్పాదులవారు అతి చంచలమైన మనస్సు నిగ్రహము చాలా కష్టమని ఆ నిగ్రహమునకు సగుణసేవ సాధనమని సూచిస్తూ కొన్ని శ్లోకములను వ్రాసిరి. ఆ శ్లోకములను పరతరే చేత స్సమాధీయతా మనే ప్రసంగంలో వ్రాయుచున్నాను.

శ్లో || చేతో భృంగ భ్రమసివృధాభవ మరుభూమౌ విరసాయాం

భజభజ లక్ష్మీ నహసింహానఖ పదసరసిజ మకరందం ||

అనగా. ఓ మనస్సనే తుమ్మిదా! నీవు సహజముగా ధర్మముల యందుగల మకరందమును, ఆస్వాదించతగిన యోగ్యతకలదానవు. మకరందమనగా పుష్పరసం. అంతేగాని సారములేని ప్రదేశములయందు తిరుగుట, భ్రమించుటకూడదు, ప్రయోజనంలేదు. నీవు నా సంసారమనే మెట్ట ప్రదేశమందు వృధాగా తిరుగుచున్నావు. ఈ సంసార మరుభూమి యందు అనగా ఊసరక్షేత్రమందు వృధాగా తిరగవద్దు. సారంలేదు. సారంలేదుగనుక అనుభవించేదేమియు లేదు. పైగా తిరిగినందువలన శ్రమయేగాని సుఖంలేదు. సుఖమున్నదని భ్రమపడవద్దు. సరే. సంసార మరుభూమియందు సారంలేదు. వృధాగా తిరగవద్దన్నారు బాగానే ఉంది. గాని సారంగల ప్రదేశ##మేది యని అడిగేదవేమో చెప్పుచున్నాను విను.

"భజ భజ లక్ష్మీనరసింహా నఖపద సరసిజ మకరందం" నిర్గుణ మగు అద్వితీయమగు, నిత్యస్వప్రకాశమగు ఆనందరసమును అనుభవించుటయే ముఖ్యముగాని ఒక ఆకారంకల వస్తువులయందే సంచరించు అలవాటులో నున్నావుగనుక నిర్వికారమును అందుకొనలేవు. నిర్వికారమందు నిలబడలేవు. గనుక లక్ష్మీనసింహస్వామివారి పాదములనే పద్మములయందు అంతట నిండియున్న మకరందమును సేవించుము. ఆ మకరందమును సేవించినయడల చాలా ఆనందము కలుగును. భజభజ యని రెండు మాట్లు యెందుకు చెప్పుచున్నానంటే ఆదరంగా యల్లపుడు లక్ష్మీనరసింహ స్వామివారి పాదారవింద మకరంద సేవచేయుము. అశ్రద్ధతోమాని, భ్రమతో సంసారమనే మెట్టభూమియందు వృధాగా తిరగబోకని చెప్పుచున్నాను. లక్ష్మీనరసింహస్వామివారి పాదారవింద మకరందమునే సేవించుము. ఆ మకరందమును సేవించినయడల సంసారమనే ఊషరభూమియందు తిరిగే దుస్థితి నీకు పోవును.

లక్ష్మీనరసింహస్వామివారి పాదారవింద మకరందమును యల్లపుడు సేవింపుము. ఇదియే పరమానందముగానుండి స్వరూపానుభూతిని కలుగజేసి; గొప్ప ఔషధం- పురాణవ్యాధిని పోగొట్టి ఆరోగ్య సౌఖ్యము నిచ్చినట్లు. అనాదిగా అజ్ఞానమువలన యేర్పడిన జీవత్వభ్రమ, జనన మరణ దుఃఖపరంపరగా నున్న సంసారరోగమును మూలముతోసహా పోగొట్టి నిత్యమగు పరమానందమును చేకూర్చును. అనగా యల్లపుడు సంసారకృత్యములయందే మనస్సును భ్రమింపచేయకూడదు. లక్ష్మీనరసింహస్వామివారి పాదసేవ చేయవలయును. అనగా భగవత్సేవ చేయవలయును. ఆ భగవంతునియందు నిరంతర భక్తిని వుంచవలయును. సగుణ సేవచేతనే నిర్గుణ సాక్షాత్కారముకలిగి అజ్ఞానముతో సహా సంసారభ్రమ నశించి ముక్తిలభించునని తాత్పర్యము.

శ్లో || త్వత్ర్పభు జీవప్రియ మిచ్ఛసిచే న్నరహరి పూజాంకురు సతతం |

ప్రతిబింబాలంకృతి విధి కుశలః బింబాలంకృతి మాదధ తే ||

చేతోభృంగ భ్రమసివృధాభవ మరుభూమౌ విరసాయాం

భజభజ లక్ష్మీనరసింహా నఖపద సరసిజ మకరందం ||

స్వామీ! నేను మనస్సును, జరమును, సుఖము ననుభవించేవాడు జీవుడుకదా ఆయనతో భగవంతుని సేవ చేయమనక, నాతో చెప్పెదరేమిటంటావేమో; నిజమే. జీవుడే సుఖమును అనుభవించేవాడుగాని నీ మీదనే జీవుడు ఆధారపడి యున్నాడు. నీకు జీవునికి అనాదినుండి సంబంధమున్నది ఆయనకు సుఖదుఃఖములు నీవలననే యేర్పడుచున్నవి. నీవు మంచికృషిచేయకపోతే, జీవుడు బాగుపడడు. నీకు జీవుడు ప్రభువు లాంటివాడు. ప్రభువుకు ఉపకారం చేయవలయును గాని, అపకారం చేయకూడదు. నీవు సరీగా లేవు గనుకనే జీవుడు స్వతంత్రముగా బాగుపడలేక సంసారబాధల ననుభవించుచున్నాడు. గనుక నీకు ప్రభువైన జీవుడు బాగుపడవలెనంటే, యెల్లపుడు భగవంతునిపూజచేయుము, అటుల నీవు నేను చెప్పినప్రకారం భగవంతుని పూజచేసినయడల జీవునికికల సర్వ సంసారబాధలు పోవును.

అయితే బాగుపడవలసినవాడు జీవుడా, అనగా దుఃఖముపోయి సుఖమును పొందలవసినవాడు జీవుడుకదా. పూజింపతగినవాడు భగవంతుడా పూజచేయవలసింది మనస్సునగు నేనా భగవంతుని పూజించి అలంకరించి తృప్తిపరచితే జీవుడు బాగుపడడమేమిటి అంటారేమో. ఓ మస్సా వినుము. "ప్రతిబింబాలంకృతి విధికుశలః బింబాలంకృతి మాదధతే" లోకంలో బింబము, ప్రతిబింబము అంటారు. తెలుసునుకదా. మన ముఖం బింబం అద్దంలో చూచుకుంటే, అద్దంలో కనిపించే ముఖం ప్రతిబింబం కదా! అద్దంలో ప్రతిబింబించిన మన ముఖం బాగా అలంకారంగా కనిపించవలెనంటే అసలు ముఖమును బాగా అలంకరించుకొని తిలకం మొదలగునవి పెట్టుకొని అద్దంలో చూస్తే అద్దంలో ప్రతిబింబం అసలు ముఖంయేవిధంగా అలంకారంగా నున్నదో అదేవిధముగా కనిపించును.

కారణమేమంటే, అసలు ముఖమగు బింబమే ప్రతిబింబముగా కనిపించును గనుక బింబంకంటే ప్రతిబింబం వేరు కాదు, గనుకనే అందరు బింబమునే అలంకరించుకొందురు. జీవుడు, ఈశ్వరుడు ఇద్దరున్నారు కదా. అందులో జీవుడు ప్రతిబింబము, ఈశ్వరుడు బింబము. గనుక బింబమగు భగవంతుని పూజించినయడల, సేవించి తృప్తిపరచిన యడల అట్టి తృప్తి, అట్టి అలంకారం, ప్రతిబింబ రూపముగానున్న జీవునికి తప్పకవచ్చును. గనుక ఓ మనస్సా నీవు ప్రతిబింబమగు జీవుడు బాగుపడవలెనంటే బింబమగు భగవంతుని ముఖ్యముగా పూజించి సేవించుము. జీవుడు తప్పక ఈశ్వరస్వరూపుడగును. భగవంతుని ఏవిధంగా ఉపాసిస్తారో, ఉపాసకుడుకూడా ఉపాసింపబడే భగవత్స్వరూపుడగునని శాస్త్రముకూడా చెప్పుచున్నది.

బింబమగు భగవంతునికంటే ప్రతిబింబమగు జీవుడు వేరేలేడని అర్థము, అనగా నిర్గుణధ్యానం చేయలేనపుడు సగుణారాధనచేసి, సగుణమగు ఈశ్వరుని అనుగ్రహమును పొంది నిర్గుణసాక్షాత్కారమును సంపాదించి కృతకృత్యులం కావాలని తాత్పర్యము. జీవేశ్వరులు ప్రతిబింబబింబరూపులు గనుక పరమాత్మ ప్రతిబింబించుటకు అద్దంలాంటి ఉపాధి మనస్సే గనుక ఆ మనస్సునందుగల పరమాత్మ ప్రతిబింబమే జీవుడు. ఆ మనస్సనే ఉపాధిని సగుణసేవద్వారా నిర్గుణబ్రహ్మసాక్షాత్కారమును సంపాదించి లయంచేయగానే జీవునికి ప్రతిబింబమును, ఈశ్వరునికి బింబత్వం కూడా పోవును గనుక, ఆ ప్రతిబింబమగు జీవుడు బింబమగు పరమాత్మలో ఐక్యమును పొందునని గూడా అభిప్రాయమని చెప్పుకొనవచ్చును.

జీవుడను భేదంకలుగుటకు మనస్సే కారణం. అందువలననే "మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః" అనగా జీవులకు బంధము నకుగాని, మోక్షమునకుగాని మనస్సే కారణం. మనస్సు ఆత్మ భిన్నమగు ప్రపంచ విషయములయందు ఆసక్తి కలిగియున్నయడల జీవుడు బంధమును పొందును. పరమాత్మ విచారముచేసి, పరమాత్మ ధ్యానంచేసి పరమాత్మయందేనిలచినయడల అనగా తదాకారాకారితమైన యడల జీవుడు బంధమును పోగొట్టుకొని పరమాత్మ స్వరూపస్థితియనే ముక్తినిపొందును.

శ్లో || శుక్తౌ రజతప్రతిభాజాతా కటకాద్యర్థ సమర్థాచేత్‌

దుఃఖమయీతే సంసృతి రేషా నిర్ర్వతిదానే నిపుణాస్యాత్‌ ||

చేతోభృంగ = మకరందం ||

సంసారదశయందు సంసారంవలన సుఖ మెంతమాత్రమూ లేదు. యెటులననగా ముత్యపుచిప్పయందు వెండియని భ్రమకలుగును. ఒకప్పుడు ఆ భ్రమలో కనపించిన వెండి, కడియములు మొదలగు వెండి సామానులు చేయించుకొనుట కుపయోగిస్తే, సంసారంకూడా మోక్షమునిచ్చును. అనగా ఆ పరమానందము నిచ్చుటలో సాధనమగును. అట్లు యెప్పుడుకాదు. శుక్తిరజితం, వెండి సామానులకూ ఉపయోగించదు. సంసారము, ముక్తికిని ఉపయోగించదని తాత్పర్యము గనుక ఓ మనస్సా, నీవు సంసార మరుభూమియందు వృధాగా పరిభ్రమింపక భగవంతుని సేవింపుము.

శ్లో || ఆకృతి సామ్యాచ్ఛాల్మలి కుసుమేస్థల నళినత్వభ్రమ మకరోః |

గంధరసావిహ కిమువిద్యే తే విఫలం భ్రామ్యసి విసృజైనం ||

చేతో భృంగం = మకరందం.

ఓ మనస్సా! నీవు బూరుగపుష్పమును చూచి మెట్టతామర పువ్వని భ్రమపడితివి. రెంటికిని ఆకారసామ్యమువలనకదా. బూరుగ పుష్పమందు గంధము. రసము ఏమియు లేవు. వృధాగా తిరుగుచున్నావు. గంధ రసములులేని బూరుగ పుష్పములు వదలుము. అనగా సంసార మంతయు సారములేనిదిగనుక, నిజమైన సుఖములేదుగనుక, ఈ సంసారమందు భ్రమపడి సంచరించుటవలన దుఃఖము కలుగుటయేగాని విశ్రాంతి కలుగదు, భగవంతుని పాదారవింద సేవచేయుటయే నీకు క్షేమమని, భగవదనుగ్రహమే జీవునికి తరణోపాయమని తాత్పర్యము.

శ్లో || స్రక్చందన వనితా న్విషయాన్సుఖదాన్మత్వా 7త్రవిహరసే |

గంథఫలీ సదృసామీతే భోగానంతర దుఃఖకృతః ||

చేతోభృంగం = మకరందం .

ఓ మనస్సా, నీవు పుష్పమాలికలు, మంచిగంధములు, స్త్రీలు మొదలగు విషయములవలననే చాలా సుఖము కలుగునని చాలా భ్రమతో ఈ విషయములనే అనుభవించుచున్నావు, భావించుచున్నావుగాని, వీటివలన సుఖ మేమాత్రములేదు. ఇవి సంపెంగ పువ్వుతోసమానమైనవి. సంపెంగ పువ్వులమీదికి గంధమును అనుభవింతమనే భ్రాంతితో తుమ్మెద వెళ్ళివాలితే మరణమే సంభవించునుకదా. సంపెంగపువ్వు అనుభవం నీకున్నదికదా, దానితో సమానమగు ఈ విషయములుకూడా మరణప్రదములేనగాని సుఖసాధనములు కావని తెలుసుకొనుము. అనగా విషయములు సుఖసాధనము లనుకొనుట చాలా పొరపాటు. విషయములనగా బంధించేవి యని అర్థము. జీవునికి నిజమైన సుఖంలేకుండా తత్వమును తెలుసుకొనకుండాచేసి మిధ్యాభూతమగు ప్రపంచంలో బంధము నిచ్చుననే విషయములు. అట్టి విషయ ములవలన సుఖంకలుగునని భ్రమపడకూడదు, భగవంతుని సేవచేసి, ఇట్టి భ్రమను క్రమముగా వదలి కృతకృత్యులు కావలయుననితాత్పర్యము.

అన్నింటికి సారాంశమగు తత్వమును చెప్పెదను వినుము. ఈ తత్వమును గ్రహించిన యడల నీకు ప్రమాద మెప్పుడు కూడా వుండదు. పరమానందము కలుగును.

శ్లో || తవహిత మేకం వచనం వక్షే శృణు సుఖకామో యది సతతం

స్వప్నే దృష్టం సకలం హిమృషా జాగ్రతిచ స్మర తద్వదితి |

చేతోభృంగభ్రమసి వృథాభవ మరుభూమౌ విరసాయాం |

భజభజ లక్ష్మీనరసింహా నఖపద సరసిజ మకరందం ||

నీవు బాగుపడవలెనంటే, బాగా సుఖపడవలెనంటే చాలా హితమైన ఒక్కమాట చెప్పెదను వినుము. నేను చెప్పిన తరువాత విని ఇంతే కదాయని తేలికగా భావించవద్దు అది ఏమనగా "స్వప్నేదృష్టం సకలంహిమృషా జాగ్రతిచ స్మర తద్వదితి" అనగా స్వప్నావస్థయందు రాజ్యము లభించినట్లు. తను రాజు అయి రాజ్యపరిపాలన చేసినట్లు కనిపించినను, ఆ సమయమందు ఆ రాజభోగములవలన సుఖము భాసించినను, పుత్రమిత్ర కళత్రాదులు కనిపించి వాటివలన చాలా సుఖణును అనుభవించునట్లు గోచరించినను, యింకా తను అనేక విషయభోగములను అనుభవించినట్లు స్వప్నదశయందు గోచరించి సుఖముకలిగినట్లున్నను ఆ సమయమందు అది సత్యముగా గోచరించినను మెళుకువచ్చేసరికి అంతయు మాయమై పోవుచున్నదనే విషయం అనుభవసిద్థమే.

స్వప్నావస్థయందు కనిపించిన దృశ్యములు సత్యమనువా రెవ్వరును లేరుకదా. అందువలననే అందరికిని స్వప్నమందలి దృశ్యములు సత్యములు కావని సమ్మతం గనుకనే దృష్టాంతముగా స్వప్నావస్థను చెప్పిరి. స్వప్నములవె జాగ్రదవస్థయందు కనిపించే ప్రపంచమంతయు మృషా, అనగా మిథ్యా. అనగా పరమాత్మానుభూతియనే ప్రబోధ కలిగిన తరువాత నశించునదే యని అర్థము, స్వప్నప్రపంచమువలె జాగ్రత్ర్పపంచముకూడా ఆరోపమేనని, మిథ్యాభూతమేనని సర్వదా స్మరించుము. మెళుకువరాగానే స్వప్నావస్థయందు కల్పితమగు ప్రపంచముతోసహ ఆ యవస్థయందు కల్పితమగు ఉపాధిగల స్వప్నద్రష్టకూడా స్వప్న శరీరమును వదలి జాగ్రదవస్థలోనున్న స్వరూపంతో మిగులుచున్నాడు.

అటులనే ఆత్మసాక్షాత్కారమనే మెళుకువ రాగానే అజ్ఞాననిద్రలో కల్పితమగు ఈ ప్రపంచభ్రమ పోయి, ఈ ప్రపంచమును చూచిన కల్పిత మగు జీవభావముపోయి పరమాత్మస్వరూపముగా మిగులును. ఈ విషయమును అతివిస్తారముగా దక్షిణామూర్తిస్తోత్ర తాత్పర్య వివరణమందు వ్రాసితిని, అంతయు మనస్సుచేతనే కల్పితమగుచున్నది గనుక, ఆ మనస్సు జీవునికి ఉపాధియేగనుక మనస్సు ఉంటేనే జీవత్వ ముండును. లేకపోతే లేదుగనుకను. ఆమనస్సే జీవుని బంధమోక్షములకు కారణం గనుకను, అట్టి మనస్సును నిగ్రహించుట చాలా కష్టంగనుకను. పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తజీవరాసులను సంసార మరుభూమియందు పరిభ్రమింపచేయునది మనస్సే గనుకను పరమ దయామయులగు శంకర భగవత్పాదులవారు ఓ మనస్సా యని మనస్సునే సంబోధించి నీవే జీవుని బాగుచేయవలయును. అందుకొరకు భగవదారాథన చేయవలయును. సంసార మరుభూమియందు సారము లేదు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి పాదారవింద మకరందమును సేవింపుమని చెప్పిరి.

ఈ సోపానపంచకమందు భగవత్పాదులవారు "పరతరే చేతస్సమాధీయతాం" అని పరమాత్మయందే మనస్సును నిలుపుమనిచెప్పిరి. గనుక ప్రసంగవశమున ఈ సోపానపంచక తాత్పర్య వివరణలో ఈ శ్లోకము లను ఉదహరించి తాత్పర్యమును వ్రాసితిని. ఈ సోపానపంచకములోని చివరశ్లోకములో చివరన "అథ పరబ్రహ్మాత్మ నాస్థీయతా" మని చెప్పిరి. బహుజన్మలలో చేసిన మహాపుణ్యములతో పరిశుద్ధమైన అంతఃకరణకలిగిన మహానుభావులు పరమ విరక్తులై, తత్వవిచారముచేసి, బ్రహ్మధ్యానంచేసి, బ్రహ్మానుభూతిని పొంది పరబ్రహ్మ రూపముగా నుందురు. గనుక జిజ్ఞాసువులందరును వేదశాస్త్ర సర్వసారమును బోధించు ఈ సోపానపంచకమందు చెప్పిన సాధనలను శాస్త్రోక్తప్రకారముగాను, అధికారానుసారముగాను ఆచరించి పరమాత్మాను భూతిని పొంది పరబ్రహ్మరూపులుగా నుండవలయునని తాత్పర్యము.

ఇట్లు శ్రీ శంకరాచార్య విరచితమగు శ్రీమద్వైతోపదేశ పంచ

రత్నములనే మరియొక పేరుగల సోపాన పంచకమునకు

మద్దులపల్లి మాణిక్యశాస్త్రిచే రచింపబడిన తత్వరహస్యప్రభ యను తెలుగు టీకా తాత్పర్య వివరణం సమాప్తం.

సోపాన పంచకం సమాప్తం.

Thathva Rahasyaprabha    Chapters